ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా

ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా
అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక రేటింగ్‌ కంపెనీ మూడీస్‌ చీఫ్‌ మార్క్‌ జాండీ హెచ్చరించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న విధాన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాండీ మాట్లాడుతూ ఇటీవల ట్రంప్‌ పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. 

టారిఫ్‌లు ఆయా దేశాలతో పాటు అమెరికాపైనా ప్రభావం చూపిస్తాయని, దీనికితోడు ట్రంప్‌ అనుసరిస్తున్న వలస విధానం ఉద్యోగ నియామకాలను నెమ్మదించేలా చేసిందని చెప్పారు. ఫెడరల్‌ రిజర్వ్‌ విషయంలో ట్రంప్‌ నిర్ణయాల ప్రభావం వ్యాపార రంగంపై భారీగా ఉందని, పెట్టుబడులు మందగించాయని వివరించారు.  వీటన్నింటి ఫలితంగా అమెరికా ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందని జాడీ ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, ఆర్థిక మందగమనం లక్షణాలు ఇంకా బయటపడనప్పటికీ నిర్మాణ రంగంతోపాటు ఉత్పాదక రంగంలో సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. వివిధ దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల ప్రభావం అమెరికాలోని వినియోగదారుడిపై ఇంకా పూర్తిస్థాయిలో కనిపించడంలేదని జాడీ తెలిపారు.  ఈ సందర్భంగా మదుపరులను జాడీ హెచ్చరిస్తూ ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్‌ కూడా సురక్షితం కాదని సూచించారు. యూఎస్‌ జీడీపీలో మూడో వంతు (33.33 శాతం) ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుందని జాండీ తెలిపారు.

రాష్ట్రాల వారీగా చూస్తే, వ్యోమింగ్‌, మోంటానా, మిన్నెసోటా, మిస్సిస్సిప్పీ, కాన్సాస్‌, మసాచుసెట్స్‌కు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.  ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోతపెట్టడంతో వాషింగ్టన్‌ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటోందని తెలిపారు. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనావేసిన ఆర్థికవేత్తల్లో జాండీ ఒకరు. ఆ సంక్షోభం అమెరికాతో పాటు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి విదితమే.

అమెరికాలో ధరలు, ముఖ్యంగా నిత్యావసరాల రేట్లు మళ్లీ పెరుగుతున్నాయని, త్వరలోనే అందుకోలేని స్థాయికి ధరలు ఎగబాకవచ్చని జాండీ స్పష్టం చేశారు. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ధరాభారం కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి కూడా తగ్గిందని, వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-09 ఆర్థిక సంక్షోభ కాలం నాటి కనిష్ఠ స్థాయికి జారుకుందని పేర్కొన్నారు. 

ఈ జూలై లో అమెరికాలో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరో 0.2 శాతం పెరిగి 2.7 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికాలంలో సూచీ 4 శాతానికి ఎగబాకవచ్చని జాండీ అంచనా వేశారు. తత్ఫలితంగా అమెరికన్ల కొనుగోలు శక్తి మరింత తగ్గిపోవచ్చని జాండీ వివరించారు.  పెరుగుతున్న ధరలు, సుంకాలతో పెరిగిన వాణిజ్య అనిశ్చితి, తగ్గుతున్న కొనుగోళ్లు మున్ముందు త్రైమాసికాల్లో ఆ దేశ జీడీపీని మాంద్యంలోకి నెట్టవచ్చునని తెలుస్తుంది.

ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధం కారణంగా అమెరికాలో ఉద్యోగావకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో వ్యవసాయేతర ఉద్యోగ నియామకాలు అంచనాల కంటే తగ్గి 22 వేలకు పరిమితమయ్యాయి. అదే సమయంలో నిరుద్యోగిత రేటు 4.2 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. అంతేకాదు, మే, జూన్‌ నెలలకు విడుదల చేసిన ఉద్యోగ గణాంక అంచనాలను కూడా భారీగా తగ్గించింది.