తెలంగాణాలో మత పిచ్చి రాజకీయాలు సాగిస్తున్న కాంగ్రెస్

తెలంగాణాలో మత పిచ్చి రాజకీయాలు సాగిస్తున్న కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మత పిచ్చి రాజకీయాలను కొనసాగిస్తోందని బిజెపి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీశ్ బాబు ధ్వజమెత్తారు.  ప్రతి వర్గానికి సమాన న్యాయం, అభివృద్ధి అవసరమైనప్పటికీ, ప్రభుత్వం కేవలం ముస్లిం మైనారిటీలకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా విభజన రాజకీయం చేస్తోందని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన “రేవంతన్న కా సహారా –మిస్కీనో కే లియే” పథకం ఒక్క వర్గానికి మాత్రమే పరిమితం చేయడం, ప్రతి ఒక్కరి సంక్షేమం అనే నినాదాన్ని విస్మరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల ఆర్థిక, ధార్మిక హక్కులను విస్మరిస్తోందని అయన మండిపడ్డారు.  హిందూ గుడులు, ఆలయాల ఆదాయాలను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటూ, దూపదీప, నైవేద్యాల కోసం పనిచేసే పూజారులు, ఆలయ సిబ్బంది, బ్రాహ్మణ వర్గాలను పక్కన పెట్టి, ఆ డబ్బును కేవలం మైనారిటీ పథకాలకు మళ్లించడం పట్ల డా. హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి నిజంగా కావాల్సింది అభివృద్ధి, కానీ ప్రభుత్వం ఉద్యోగాలు, పరిశ్రమలు, రైతు సంక్షేమం, యువతకు అవకాశాలు వంటి కీలక అంశాలను విస్మరించి, కేవలం మతపరమైన ఓటు లబ్ధి కోసం రాజకీయాలు చేయడం దుర్మార్గం అని ఆయన ధ్వజమెత్తారు.   రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రి ఈ విషయంపై పరిశీలన చేసి, ఆలయాల సిబ్బంది హక్కులు, వసూలు ఆదాయాలు సరైన రీతిలో ఉపయోగించేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని బీజేపీ ఎమ్యెల్యే విమర్శించారు. హిందూ దేవాలయాల రక్షణలో విఫలమైందని స్పష్టం చేశారు.  ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయం, శంషాబాద్‌లోని నవగ్రహ ఆలయం, శంషాబాద్ జూకల్‌లోని పోచమ్మ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డా. హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, భారతీయ సాంస్కృతిక వారసత్వ చిహ్నాలకు రక్షణ కరువైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.   మైనార్టీ సంక్షేమం చేయడం తప్పు కాదని, కానీ ఒకే వర్గానికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం, సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం, ప్రజల ద్వారా వసూలు అయ్యే పన్నుల డబ్బును వృధా చేయడం, ఆలయాలు, పూజారుల హక్కులను పక్కన పెట్టడం అంగీకరించలేమని స్పష్టం చేశారు.  ఈ సందర్భంలో, కేవలం ఉప ఎన్నికల నేపథ్యంలో ఒక వర్గం ఓట్లు పొందేందుకు సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం సబబు కాదుని చెప్పారు.