జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం

జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
* ఐసిస్ ఉగ్రవాదుల కోసం రాంచి హోటల్ లో బాంబుల తయారీ 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చైనా గ్రెనేడ్లతోపాటు  పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ సెక్టార్‌లోని ఒక చోట ఆయుధాలున్నట్లు నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. 20 చైనా హ్యాండ్ గ్రెనేడ్‌లతో సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఉగ్రవాద కార్యకలాపాల కోసం తరలించేందుకు వాటిని అక్కడ దాచినట్లు భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. సకాలంలో వీటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, కశ్మీర్‌లోని ఏడు జిల్లాలైన శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుప్వారా, హంద్వారా, పుల్వామా, షోపియన్‌లో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది కలిసి సోదాలు నిర్వహించారు. ఉగ్రవాద నేరాలకు సంబంధించిన డిజిటల్ పరికరాలతోపాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మరోవంక, జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఒక హోటల్ రూమ్‌లో ఐసిస్‌ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారుచేస్తూ ఓ విద్యార్థి పట్టుబడ్డాడు. ఇది స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌  పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పుకుంటూ డానిష్ అనే యువకుడు ఇస్లామ్‌నగర్ ప్రాంతంలోని తబారక్ లాడ్జ్ హోటల్ రూమ్ నంబర్ 15లో బాంబులు తయారు చేస్తున్నాడు. 

 
ఆ రూమ్‌ను అతడు బాంబుల తయారీకి మాత్రమే కాకుండా ఉగ్రవాదుల నియామక కేంద్రంగానూ ఉపయోగించాడు.  ఢిల్లీ పోలీసులు ముందుగా అఫ్తాబ్ ఖురేషీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అఫ్తాబ్ గురించి వచ్చిన సమాచారంతో జార్ఖండ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి రైడ్‌ నిర్వహించిన ఢిల్లీ పోలీసులు డానిష్‌ను పట్టుకున్నారు. 
 
రూమ్‌లో గన్‌పౌడర్, బాంబులు, పొటాషియం నైట్రేట్ (ఎరువుల్లో ఉండే రసాయనం), ఎసిటోన్ పెరాక్సైడ్ వంటి పేలుడు పదార్థాలు, సొంతంగా తయారు చేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తయారు చేసిన బాంబులను పరీక్షించేందుకు సుబర్నరేఖ నదిలో పేల్చినట్లు పోలీసులు గుర్తించారు.