పాక్‌-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు

పాక్‌-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
పాకిస్థాన్‌, సౌదీ అరేబియా మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందంలో ఇతర అరబ్‌ దేశాలు కూడా చేరే అవకాశం లేకపోలేదని పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ వెల్లడించారు. అటువంటి పరిణామాలకు తలుపులు మూసుకుపోలేదంటూ ఆయన తెలిపారు.  ఒక దేశంపై దాడి జరిగితే రెండు దేశాల మధ్య జరిగిన దాడిగా పరిగణించే పరస్పర రక్షణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌, సౌదీ అరేబియా బుధవారం కుదుర్చుకున్నాయి.
 ఖతార్‌లో హమాస్‌ నాయకులపై ఇజ్రాయెల్‌ సైనిక దాడులు జరిపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పరస్పర రక్షణ ఒప్పందంలో మరిన్ని అరబ్‌ దేశాలు భాగస్వాములయ్యే అవకాశం ఉందా? అన్న విలేకరుల ప్రశ్నకు తాను దీనికి ఇప్పుడే సమాధానం చెప్పలేనని, అయితే తలుపులు మాత్రం మూసుకుపోలేదని మాత్రం కచ్చితంగా చెప్పగలనని ఆసిఫ్‌ చెప్పారు.

పాకిస్థాన్‌కు ముప్పు ఎక్కువగా ఉన్న కారణంగా ఇస్లామిక్‌ దేశాల మధ్య నాటో తరహా ఏర్పాటు ఉండాలని తాను మొదటినుంచి వాదిస్తున్నట్లు అంతకు ముందు ఆసిఫ్‌ చెప్పారు. తమ ప్రాంతాన్ని, దేశాలను సమైక్యంగా పరిరక్షించుకోవలసిన ప్రాథమిక హక్కు ముస్లిం దేశాలకు, ముఖ్యంగా ముస్లిం ప్రజలకు ఉందని ఆయన తెలిపారు. ఇతర దేశాల ప్రవేశాన్ని అడ్డుకోవడం లేక మరే ఇతర దేశంతో పాకిస్థాన్‌ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోరాదన్న నిబంధన ఏదీ రెండు దేశాలు చేసుకున్న ఒప్పందంలో లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఒప్పందం కింద పాకిస్థాన్‌ అణ్వస్ర్తాలు కూడా సౌదీకి ఉపయోగపడతాయా? అన్న ప్రశ్నకు తమకు ఉన్న సమస్త ఆయుధ సంపత్తి ఒప్పందం కింద సౌదీకి కూడా కచ్చితంగా అందుబాటులో ఉంటుందని ఆసిఫ్‌ వెల్లడించారు.  తమ అణు స్థావరాలను తనిఖీ చేసుకోవచ్చని పాక్‌ మొదటి నుంచి ఆహ్వానిస్తోందని, తమ దేశం ఎన్నడూ ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పారు.

మీ రెండు దేశాలలో ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం స్పందిస్తుందా? అన్న ప్రశ్నకు అందులో ఎటువంటి అనుమానం ఉండదని, తమలో ఎవరిపైన దాడి జరిగినా మరో దేశం స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, పాకిస్థాన్‌-సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయడంపై భారత రక్షణ శాఖ స్పందిస్తూ న్యూఢిల్లీతో పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలను రియాద్‌ దృష్టిలో ఉంచుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  

అదే  సమయంలో పాకిస్థాన్‌తో ఉగ్రవాద సంస్థలకు ఉన్న సంబంధాలను ప్రపంచ దేశాలకు భారత్‌ గుర్తు చేస్తున్నదని  తెలిపారు ఆ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని పేర్కొంటూ గత కొన్నేళ్లలో ఈ సంబంధం గణనీయంగా బలపడిందని తెలిపారు. సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాలను గుర్తుంచుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.