
అమెరికాలో విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసాదరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు దాదాపు (రూ. 88 లక్షలు) పెంచారు. ఇప్పటివరకు ఈ ఫీజు కేవలం రూ.1లక్ష నుంచి రూ.6 లక్షల మధ్య ఉండేది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం ఎక్కువగా భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉన్నది. ప్రతి హెచ్1బీ వీసా ఏడా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు.
దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించామని ఎరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక్కడి గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు ఇవ్వాలని కంపెనీలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని సూచించారు. తాము తీసుకున్న నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని, వారు చాలా సంతోషిస్తారని ట్రంప్ ఆశాభావం చేశారు. అయితే దీనిపై టెక్ కంపెనీలు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
హెచ్1బీ వీసా కింద ప్రత్యే రంగాల్లో తాత్కాలిక విదేశీ ఉద్యోగులను తీసుకురావడానికి ప్రతి ఏటా 65 వేల వీసాలను కంపెనీలకు ఇస్తారు. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు ఉన్న ఉద్యోగులకు మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. వీటికోసం లాటరీలో ప్రవేశించడానికి చిన్న మొత్తంలో చెల్లిస్తే సరిపోయేది. ఆమోదం పొందిన తర్వాత ఏటా కొన్ని వేల డాలర్లు ఉంటుంది. ఈ మొత్తాన్ని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వీసాలను మూడేండ్ల నుంచి ఆరేండ్ల కాలానికి ఆమోదిస్తారు. అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా కూడా హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లినవారే కావడం గమనార్హం. మోడల్ అయిన ఆమె 1996 అక్టోబర్‌లో వర్క్ వీసాపై అమెరికా వెళ్లి, అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ఇక ట్రంప్ మాజీ దోస్త్, టెస్లా సీఈవో, అపరకుబేరుడు ఎలాన్ మస్క్ కూడా హెచ్1బీ వీసా పొందినవారే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన అమెరికాకు వెళ్లి అక్కడే ఉండిపోయారు.
మరోవైపు ట్రంప్ గోల్డ్‌కార్డును కూడా ప్రకటించారు. దీనికి 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీనిద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉందని, వాటిని పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు గోల్డ్‌కార్డు నిధులను ఉపయోగిస్తామని చెప్పారు. 2015 నుంచి మంజూరైన హెచ్-1బి వీసాలలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి. ఈ ఫీజు పెంపు నేరుగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌పై ప్రభావం చూపనుంది.
ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేయడం ఆర్థికపరంగా భారంగా మారనుంది. ఫలితంగా, భారతీయ ఇంజినీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశముంది. బదులుగా ఐరోపా, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల వైపు ఈ టాలెంట్ వెళ్ళే పరిస్థితి ఏర్పడవచ్చు.
మరోవంక, హెచ్-1 వీసాలపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ఈ కొత్త నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున విదేశీ ప్రతిభను వినియోగించుకుంటున్నాయి. ఈ పెంపు కారణంగా వారి వ్యయాలు పెరిగి, నియామకాల్లో పెద్ద మార్పులు జరగవచ్చు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి