
అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు దాడి చేశారు. తుపాకులతో పలు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయాల కారణంగా ఇద్దరు సైనికులు మరణించారు. గాయపడిన మరో నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని భారత సైన్యం తెలిపింది.
ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు శుక్రవారం సాయంత్రం 407 టాటా వాహనంలో పారామిలిటరీ దళాలు వెళ్తున్నాయి. చురాచంద్‌ఫూర్ మార్గం సమీపంలోని నంబోల్ సబెల్ లీకాయ్ ప్రాంతంలో వీళ్ల వెహికిల్ లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు జరిపారు. ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదే మార్గం నుంచి వెళ్లారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాల్లో ఒక అధికారి తీవ్రంగా గాయాలతో కనిపించాడు.
“మణిపూర్‌లో విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన సబ్ శ్యామ్ గురుంగ్, రంజిత్ సింగ్ కశ్యప్‌లకు లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, డైరెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ & ఆల్ ర్యాంకులు నివాళులర్పించారు. మన వీర సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము” అని అస్సాం రైఫిల్స్ ‘ఎక్స్లో రాసింది.
అస్సాం రైఫిల్స్‌పై దుండగులు కాల్పులు జరిపిన ప్రాంతం ఇంఫాల్ విమానాశ్రయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఈ దాడికి తెగబడింది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. సైనికులను చంపాలనే లక్ష్యంతో జరిగిన ఈ కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకుంది సైన్యం. నిందితుల కోసం వేట ప్రారంభించిన సైన్యం వాళ్ల ఉద్దేశం ఏంటీ? అనే కోణంలో దర్యాప్తు చేయనుంది.
ఈ ఘటనను మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలనే బలమైన సంకల్పంతో వాటిని ఎదుర్కొంటామని భల్లా హెచ్చరించారు.
ఇంఫాల్ లోయ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లోని 13 పోలీస్ స్టేషన్ ప్రాంతాలు తప్ప సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం మణిపూర్ రాష్ట్రం అంతటా వర్తిస్తుంది. నంబోల్ బిష్ణుపూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది అఫ్సా పరిధిలో లేదు. కేంద్ర హోం శాఖ నిషేధిత సంస్థల జాబితా ప్రకారం మణిపూర్‌లో మైతీలకు చెందిన 9 మంది వేర్పాటువాద గ్రూప్‌లు ఉన్నాయి. నవంబరు 2021న చురుచందాపూర్‌లో కల్నల్ విప్లవ్ త్రిపాఠీ, ఆయన భార్య, కుమారుడు సహా గతంలో అసోం రైఫిల్స్‌పై జరిగిన అనేక దాడులకు ఇవే బాధ్యత వహించాయి.
More Stories
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా
శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం