సామ్‌ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు

సామ్‌ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
పాకిస్థాన్‌లో ఉంటే తనకు ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నదని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మరోసారి రాజకీయ చిచ్చు రాజేశాయి. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది.  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారి ఈ విషయమై కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్‌ పార్టీకి పాకిస్థాన్‌పై అమర ప్రేమ అని, అందుకే 26/11 ముంబై ఉగ్రదాడుల అనంతరం పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రదీప్‌ భండారి ఆరోపించారు. 
 
“దేశభక్తి ఉన్న ఎవరైనా ఉగ్రవాద దేశమైనా పాకిస్థాన్‌ను సొంత ఇంటిలా ఉందని పొగుడుతారా? కానీ రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడు, గాంధీ కుటుంబ వ్యూహాలు నిర్ణయించే నేత, గాంధీ కుటుంబంతో 30 సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తి ‘పాకిస్థాన్‌లో ఉంటే తనకు ఇంట్లో ఉన్నట్టే ఉన్నది’ అని చెప్పారు” అంటూ అయన విస్మయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వమే సామ్‌ పిట్రోడా చేత ఆ వ్యాఖ్యలు చేయించిందని ప్రదీప్‌ భండారీ ఆరోపించారు. ఇది భారతదేశ జవాన్‌లకు, 140 కోట్ల మంది భారతీయులకు అవమానమని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇవి జాతి వ్యతిరేక వ్యాఖ్యలు కాకపోతే మరేమిటి..?’ అని ప్రశ్నించారు.  ‘రాహుల్‌గాంధీ తనకు ఆరాధ్యుడు’ అని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలను ఆయన  ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ దేశం కోసం పోరాడుతాను అంటుంటే, ఆయన పార్టీ నేతలు పాకిస్తాన్‌ తమకు ఇల్లులా ఉందని అంటున్నారని బిజెపి నేత ఎద్దేవా చేశారు.

ఇటీవల దాయాది దేశంలో పర్యటించిన  సామ్‌ పిట్రోడా పాకిస్థాన్‌ పర్యటనలో తనకు సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించిందని వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపింది. తాజాగా విదేశీ విధానంపై మాట్లాడిన సామ్‌ పిట్రోడా పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లతో సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి భారత్‌ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 

 
ఈ సందర్భంగా ఆయా దేశాల్లో పర్యటించినప్పుడు తన వ్యక్తిగత అనుభవాలను గురించి ఆయన పంచుకున్నారు. “నేను పాకిస్థాన్‌కు వెళ్లాను. కచ్చితంగా ఈ విషయం మీకు చెప్పాలి. అక్కడ నేను సొంత ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందాను. నేను బంగ్లాదేశ్‌కు వెళ్లాను. నేపాల్‌కు వెళ్లాను. అక్కడ కూడా ఇంట్లో ఉన్న అనుభూతే కలిగింది” అని వ్యాఖ్యానించారు.పైగా, భారత ప్రజల జీన్స్‌, ఆయా దేశాల ప్రజల జీన్స్‌ ఒకటేనని, ఈ అన్ని దేశాల మధ్య దగ్గరి సంబంధాల కోసం సాంస్కృతిక సారూప్యతలు కూడా ఉన్నాయని సామ్‌ పిట్రోడా తెలిపారు. అయితే ఉగ్రవాదం, హింస లాంటి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని అంగీకరించారు.  అయితే పాకిస్థాన్‌ను పొగుడుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెస్‌ మొదటి నుంచి పాకిస్థాన్‌పట్ల సానుకూల వైఖరే కనబరుస్తోందని విమర్శించింది.