బలూచ్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించే అభ్యర్థనకు అమెరికా వీటో

బలూచ్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించే అభ్యర్థనకు అమెరికా వీటో
దాయాది పాకిస్థాన్‌ కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ ని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా  గుర్తించాలంటూ యూఎన్‌ భద్రతామండలిలో చైనా, పాకిస్థాన్ చేసిన అభ్యర్థనను అమెరికా అడ్డుకుంది.  ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ శాశ్వత ప్రతినిధి అసిమ్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఐఎస్ఐఎల్-కె,  ఆల్‌ ఖైదా, తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌, బలోచ్‌ ఆర్మీ, మజీద్‌ బ్రిగేడ్‌ సహా పలు ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘనిస్థాన్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. 
 
ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాదం పాక్‌ ప్రాథమిక జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభ్యర్థన మేరకు ఆ ఉగ్రసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, పాక్‌-చైనా చేసిన ఈ అభ్యర్థనను యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌ అడ్డుకున్నాయి. ఈ గ్రూపులను ఉగ్ర సంస్థలుగా గుర్తించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నాయి.కాగా, పాకిస్థాన్‌ ఆర్మీ ఫీల్డ్‌ మార్షల్‌  సయ్యద్‌ అసిం మునీర్‌  పర్యటన వేళ బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. బీఎల్‌ఏని 2019లోనే ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్‌ గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ (ఎస్‌డీజీటీ)’ జాబితాలో చేర్చిన అమెరికా,  మజీద్‌ బ్రిగేడ్‌ను కూడా బీఎల్‌ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. 

ఈ మేరకు యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతనెల కీలక ప్రకటన చేశారు. ఇటీవలే కాలంలో బీఎల్‌ఏకు చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పాక్‌లోని పలు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పాక్‌ సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తోంది. 2024లో కరాచీ ఎయిర్‌పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బీఎల్‌ఏ దాడులు చేపట్టింది. 

ఇక ఈ ఏడాది  జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్ చేసి దాదాపు 300 మంది ప్యాసింజర్లను బందీలుగా చేసుకుంది. పాక్‌ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి వారిని విడిపించింది. ఈ రైలు హైజాక్‌ ఘటనలో 31 మంది పౌరులు, పాక్‌ సైనికులు చనిపోయారు. ఇలా వరుస దాడులతో బలూచ్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించాలని పాక్‌ కోరుతూ వస్తోంది.