
ఓట్ల చోరీపై గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ ఫోన్ నంబర్ ఇచ్చి చిక్కుల్లో పడ్డారు. దేశంలో ఓట్ల చోరీపై ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో రాహుల్ విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ఆయన రక్షిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఓట్లు ఎలా చోరీకి గురవుతున్నాయో వివరిస్తూ ఓ ఫోన్ నంబర్ ను రాహుల్ ప్రదర్శించారు. అది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కు చెందిన అంజనీ మిశ్రా అనే వ్యక్తి ఫోన్ నంబర్.
రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత ఆ నంబర్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అంజనీ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత దేశం నలుమూలల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆ ఫోన్ నంబర్‌ను తాను 15 ఏళ్లుగా ఉపయోగిస్తున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు ఓటరు తొలగింపుకు సంబంధించి తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
ప్రెస్ బ్రీఫింగ్ లో రాహుల్ తన నంబర్‌ను ప్రస్తావించడం చూసి షాక్ అయినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అంజనీ మిశ్రా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’
గగన్‌యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో