
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆర్థిక అక్రమాలపై అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన కీలక ఆరోపణలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా తోసిపుచ్చింది. అదానీ గ్రూప్ కంపెనలు ఎటువంటి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడలేదని గురువారం పెట్టుబడులు, మార్కెట్ల రెగ్యులేటర్ క్లీన్చిట్ ఇచ్చింది.
”అదానీపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరూపణ కాలేదు. అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఆ సంస్థపై జరిమానా విధించాల్సిన అవసరం లేదు.” అని సెబీ హోల్ టైం మెంబర్ కమలేష్ చంద్ర వర్షనేరు తన ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో అదానీ పోర్ట్స్, అదానీ పవర్, గౌతమ్ అదానీ, రాజేష్ అదానీలపై కొనసాగుతున్న దర్యాప్తు కార్యకలాపాలను సెబీ రద్దు చేసినట్లయ్యింది.
గౌతం అదానీ అవినీతిని కీలక ఆధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను కృత్రిమంగా మార్చడానికి విదేశీ బినామీ, షెల్ కంపెనీలను వాడుకుందని, అదానీ తీవ్ర ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, సాక్ష్యాలను సంపాదించామని 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ దాదాపు 100 పేజీల సాక్ష్యాలను ప్రకటించింది.
పైగా, అప్పటి సెబీ చైర్పర్సన్ మాధాబి పురీ బుచ్‌కు అదానీ గ్రూపు సంస్థలతో ఉన్న అక్రమ ఆర్థిక సంబంధాలు ఉన్నల్ట్లు, బెర్ముడా, మారిషస్ వంటి అఫ్ షోర్ కంపెనీల్లో, అందునా గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు బుచ్ ఫ్యామిలీ అంగీకరించిందని హిండెన్‌బర్గ్ తెలిపింది.
‘అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన సెబీ ఛైర్మన్‌కు వాటిల్లో వ్యక్తిగత పెట్టబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయి. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుంది.’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోయాయి. సుమారు 150 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయాయి.
అయితే అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందనడానికి ఆధారాల్లేవని ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక స్పష్టంచేసింది. దీంతో భారీగా పతనమైన గ్రూప్ షేర్లు మళ్లీ కోలుకున్నాయి. తాజాగా సెబీ కూడా క్లీన్చిట్ అదానీ గ్రూప్‌నకు ఊరట కల్పించే అంశంగా మారింది. మరోవైపు ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ సంస్థ ఈ ఏడాది జనవరిలో తన కార్యకలాపాలు మూసివేసింది.
సెబీ క్లీన్‌చిట్‌తో అదానీ గ్రూప్‌కు పెద్ద ఊరటనిచ్చినా, అమెరికాలోని 265 మిలియన్ డాలర్ల లంచం కేసులో ఆరోపణలు ఇంకా కొనసాగుతున్నాయి.
సెబీ క్లీన్చిట్ ఇచ్చిన తర్వాత గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సమగ్ర దర్యాప్తు తర్వాత హిండెన్‌బర్గ్ ఆరోపణలు అవాస్తవమని మరోసారి రుజువైంది. నేను ఎప్పటినుంచో ఇదే విషయం చెబుతున్నా” అని తెలిపారు.
అయితే, ఈ కుట్రపూరిత నివేదిక కారణంగా పెట్టుబడిదారులు నష్టపోయినందుకు బాధగా ఉందని చెప్పారు. పైగా, తప్పుడు వాదనలు ప్రచారం చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి నిర్మాణంలో తమ నిబద్ధత కొనసాగుతుందందని అదానీ రాసుకొచ్చారు. అంతేకాకుండా తన పోస్ట్‌కు జాతీయ జెండాను జోడిస్తూ సత్యమేవ జయతే! జైహింద్!! అని పెట్టారు.
More Stories
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
గగన్‌యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో
ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించటం అసాధ్యం