భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ” ఆపరేషన్ చేయూత” కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడనాడి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడిపేందుకు సుముఖత చూపుతున్నారు.
వివిధ స్థాయిలలో ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఆరుగురు మావోయిస్టులు కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో ఉసూరు ఎల్‌ఓఎస్ కమాండర్-పామెడ్ ఏరియా కమిటీ మడకం దేవా అలియాస్ దినేష్, పమేడ్ ఎల్‌ఓఎస్ పార్టీ సభ్యుడు మడావి జోగా, మిలీషియా సభ్యులు పొడియం దేవా, మడకం ఇడుమాస్, మడకం ముకా, మడివి ఈత ఉన్నారు.
లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి రూ. 25 వేలు చొప్పున మొత్తం నగదు రూ. రూ. 1.50 లక్షలు అందించారు. తదుపరి వారి ర్యాంకుల వారిగా మిగతా నగదును, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ వచ్చిన తర్వాత వారి బ్యాంకు ఖాతాలలో మిగతా మొత్తం ను చెక్కుల రూపంలో జమ చేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం జనవరి-2025 నుండి 320 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు.
లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ మహిళా సభ్యురాలు పోతుల పద్మావతి @ కల్పన @ మైనక్క @ సుజాతక్క ఈ నెల 13న తెలంగాణ డిజిపి ముందు లొంగిపోగా, పునరావాసంలో భాగంగా ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున లొంగిపోయిన రోజునే రూ. 25 లక్షలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివాసి ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, వైద్యశాలలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి మారుమూల గిరిజన ప్రాంతానికి నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
“మీరు నమ్మకంతోనో లేదా భయంలోనో మావోయిస్టు పార్టీకి ఎంత సహకరించినా మీ ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధితో కూడిన ప్రజల శాంతియుత జీవనం మా పోలిసుల నినాదం” అంటూ ఆదివాసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
More Stories
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది
రామ్గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!
మోదీ విప్లవాత్మక నేత అంటూ డా. వకుళాభరణం గ్రంధం