
భారత్-అమెరికా మధ్య సుంకాల వివాదం రాబోయే రెండు నెలల్లో పరిష్కారమవుతుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే అమెరికా ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకనే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పరస్పర సుంకాలను కూడా తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. దీంతో అధిక సుంకాల భారంతో ఇబ్బంది పడుతున్న భారతీయ ఎగుమతిదారులకు ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కోల్‌కతాలో మర్చంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో సీఈఏ ఈ వ్యాఖ్యలు చేశారు. “గత ఆగస్టులో అమెరికా విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని నవంబర్ చివరి నాటికి ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 30 తర్వాత ప్రతీకార సుంకాలు ఉండవని నేను నమ్ముతున్నా. ఇది ఏదైనా నిర్దిష్ట లేదా స్పష్టమైన ఆధారాల ప్రకారంగా చేసిన ప్రటకటన కాదు. కానీ, ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే, రాబోయే రెండు నెలల్లో ప్రతీకార సుంకాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా” అని తెలిపారు.
ఎగుమతిదారులకు ఊరట కలిగించేలా పరస్పర సుంకాలను 25శాతం నుంచి దాదాపు 15శాతానికి తగ్గించేందుకు చర్చలు జరగుతున్నాయని నాగేశ్వరన్ తెలిపారు. యూఎస్ విధించిన సుంకాలకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని, ఈ దిశగా రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. సుంకాలు 10శాతం, 15శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల విలువ 850 బిలియన్ డాలర్లు ఉండగా రాబోయే రోజుల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, జీడీపీల్లో ఎగుమతుల వాటా 25 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సూచిస్తోందని నాగేశ్వరన్ తెలిపారు.
ఇటీవల జీఎస్టీ విధానంలో తీసుకొచ్చిన మార్పులు దేశంలో వినియోగాన్ని పెంచుతుందని భావిస్తున్నట్లు నాగేశ్వరన్ పేర్కొన్నారు. దీని ప్రభావం జీడీపీ వృద్ధిపై గణనీయంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు చేతుల్లో అధిక కొనుగోలు శక్తి ఉన్నప్పుడు, రేట్లు తగ్గే తగ్గుతాయని చెబుతూ అది డిమాండ్, ఉత్పత్తి, సామర్థ్యం పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. ఇది ఆదాయ వృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు.
More Stories
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్
భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య రెట్టింపు
ఆగస్టులో సుంకాలతో అమెరికాకు తగ్గిన ఎగుమతులు