పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం

పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం

పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన వ్యూహాత్మాక పరస్పర రక్షణ ఒప్పందంతో భారత్పై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తామని భారత్ వెల్లడించింది. భారత జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా అధ్యయనం చేస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ వివరించారు. “సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరిందని వార్తలు చూశాం. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తాం. ఈ ఒప్పందంతో భారత్పై పడే ప్రభావాలను అధ్యయనం చేస్తాం” విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు.

జాతీయ భద్రత, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల పట్ల గమనిస్తామని, భారత జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.   అంతకుముందు సౌదీ అరేబియా, పాకిస్తాన్ వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.  ఈ దేశాల్లో ఎవరిపైన శత్రువు దురాక్రమణ జరిగినా దానిని ఇద్దరిపైన దాడిగానే పరిగణించాలని తీర్మానం చేసింది. అప్పుడు ఇరువురు ప్రత్యర్థితో పోరాడాలన్నది ఆ ఒప్పందం ఉద్దేశం.

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా ప్రధానమంత్రి, రాజు మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ మధ్య జరిగింది.  సౌదీ అరేబియా రాజు ఆహ్వానం మేరకు బుధవారం రియాద్కు చేరుకున్న షరీఫ్, ఈ ఒప్పందంపై సంతకం చేశారు. “సౌదీ అరేబియా- పాకిస్థాన్ మధ్య ఉన్న ఎనిమిది దశాబ్దాలు సంబంధాలను మరింత విస్తరిస్తాం. ఇరు దేశాల భద్రతను పెంచడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, శాంతిని సాధించడానికి ఈ ఒప్పందం కృషి చేస్తుంది” అని సంయుక్త ప్రకటనలో ప్రకటించారు. 

“ముఖ్యంగా రెండు దేశాలు రక్షణ రంగంలో పరస్పర భాగస్వామ్యం అందించుకోవాలి. ముఖ్యంగా రెండు దేశాలపై జరిగే ఏదైనా దురాక్రమణను రెండింటిపై దాడిగా పరిగణించాలని ఒప్పందం కుదిరింది” అని ఇరు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా సౌదీకి పాకిస్థాన్ సైనిక సహాయం అందిస్తుంది. అవసరమైతే మిసైల్ ఢిఫెన్స్ అందించడంతోపాటు సౌదీలో తమ సైన్యాన్ని దింపుతుంది.

గతంలో సౌదీ సైనికులకు శిక్షణ ఇచ్చిన పాక్ ఆ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఇరు దేశాలూ తమకు పొంచి ఉన్న ప్రమాదాలపై నిఘా సమాచారాన్ని పంచుకుంటాయి. ఇక ‘అన్ని సైనిక వ్యవహారాల్లో’ తమ మధ్య భాగస్వామ్యం ఉంటుందని ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇందులో అణు సహకారం కూడా ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ అన్ని సైనిక వ్యవహారాల్లో అంటే అణ్వాయుధాలు కూడా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.