అఫ్గానిస్థాన్‌ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి

అఫ్గానిస్థాన్‌ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి
లష్కరే తోయిబా, జైషే మహామ్మద్ సహా ఐరాస ప్రకటిత ఉగ్రసంస్థలు అఫ్గానిస్థాన్‌లో కార్యకలాపాలు సాగించకుండా చూడాలని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. అఫ్గానిస్థాన్‌పై ఐరాస భద్రతామండలిలో జరిగిన సమావేశంలో ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ మాట్లాడుతూ ఆ దేశంలో భద్రతా పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు  వెల్లడించారు. 

ఘర్షణలతో దెబ్బతిన్న అఫ్గాన్‌లో శాంతి, స్థిరత్వానికి కృషి చేసే విషయంలో భారత్‌ ఆసక్తిగా ఉందని తెలిపారు. అఫ్గాన్‌కు సంబంధించిన కీలక అంశాలపై అంతర్జాయంగా, ప్రాంతీయంగా ఏకాభిప్రాయం, సహకారం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆ దిశగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయ వేదికలపై ప్రతిబింబిస్తున్నాయని హరీశ్ పేర్కొన్నారు. 

అలాగే అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ రెండుసార్లు చర్చలు జరిపిన విషయాన్ని హరీష్ గుర్తుచేశారు. “భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య సాంస్కృతిక బంధం ఉంది. అఫ్గానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వానికి కృషి చేసే విషయంలో భారత్‌ ఆసక్తిగా ఉంది. అఫ్గానిస్థాన్‌లోని భద్రతా పరిస్థితులను భారత్‌ నిశితంగా పరిశీలిస్తుంది” అని తెలిపారు. 

“ఐసిల్‌, అల్‌-ఖైదా వాటి అనుబంధ గ్రూపులు లష్కరే తోయిబా, జైషే మహామ్మద్‌ వంటి ఉగ్రసంస్థలు కార్యకలాపాలు సాగించకుండా ఐరాస సంస్థలు, వ్యక్తులతో పాటు అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలు చేయాలి” అని ఆయన స్పష్టం చేశారు.

అఫ్గానిస్థాన్​లో భూకంపం సమయంలో భారత్​ అండగా ఉందని హరీశ్ పర్వతనేని గుర్తు చేశారు. అఫ్గానిస్థాన్​కు మానవత సాయంతో పాటు అక్కడి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తులు, వ్యాధులు, పేదరికం, ఆహార కొరత వంటి సమస్యలతో బాధపడుతోన్న అఫ్గాన్​ ప్రజలకు సాయం అందించాల్సిన సమయం ఆసన్నమైందని హరీశ్‌ అభిప్రాయపడ్డారు. 

“అఫ్గాన్​కు వెంటనే మానవతా సాయం అందించిన దేశాల్లో భారత్​ ఉంది. భూకంపం వచ్చిన తక్షణమే 1,000 కుటుంబ టెంట్లు, 15 టన్నుల ఆహార పదార్థాలను పంపించాం. అదనంగా మందులు, హైజీన్ కిట్లు, బ్లాంకెట్లు, జనరేటర్లు ఇలా 21 టన్నుల పునరావస వస్తువులను అఫ్గాన్​కు పంపించాం. రానున్న రోజుల్లో ఆ దేశానికి మన నుంచి మరింత సాయం అందనుంది.” అని హరీశ్​ పర్వతనేని చెప్పారు.

2021 ఆగస్టులో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల సమయం వరకు అఫ్గాన్​కు భారత్ అండగా ఉంది. భారత్​ ఇప్పటి వరకు దాదాపు 50,000 టన్నుల గోధుమలు, 330 టన్నులకు పైగా మందులు, వ్యాక్సిన్లు, 40,000 లీటర్ల పురుగుమందులు, ఇతర సహాయ వస్తువులను మానవతా సహాయం కింద లక్షలాది మందికి సరఫరా చేసింది.