
నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి జస్టిస్ సుశీల కర్కితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఇటీవలే ఆ దేశంలో జరిగిన ఘర్షణల్లో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. నేపాల్‌లో శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు.
“గత వారం జరిగిన అవినీతి వ్యతిరేక నిరసనల నేపథ్యంలో నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కర్కితో మాట్లాడాను. ఘర్షణల్లో జరిగిన ప్రాణ నష్టంపై సంతాపం వ్యక్తం చేశాను. నేపాల్‌లో శాంతి స్థాపన, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చాను” అని ప్రధాన మంత్రి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
అదేవిధంగా శుక్రవారం నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా సుశీల కర్కి, నేపాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధాని వెల్లడించారు. రాజకీయ నేతల అవినీతి, సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై జడ్ జడ్ నిరసనకారులు నేపాల్‌లో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.
ఈ ఘర్షణల్లో దాదాపు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1,500 మంది వరకూ గాయపడ్డారు. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. జన్ జడ్ ప్రతినిధుల బృందం నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును ప్రతిపాదించారు. దీంతో ఆమె తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
More Stories
అన్ని మతాలను గౌరవిస్తాను
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు … ఇద్దరు ఎన్కౌంటర్