ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ

ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
 
ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన సెంచరీకి తోడు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, రీచా ఘోస్‌ బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలజట్టు 49.5ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది.  భారీ ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు 40.5ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది.
ఎలైసా పెర్రీ(44), సథర్లాండ్‌(45) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా భారత బౌలర్లు క్రాంతి గాడ్‌కు మూడు, దీప్తి శర్మకు రెండు, రేణుక, స్నేహ్ రాణా, అరుంధతి, రాధా యాదవ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది.  ఓపెనర్లు ప్రతికా రావల్‌(25), మంధాన కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జతచేశారు. ఆ తర్వాత హర్లిన్‌(10), కెప్టెన్‌ హర్మన్‌(17) నిరాశపరిచినా దీప్తి శర్మ(40) ఆదుకుంది.
ఈ క్రమంలో మంధాన(117; 91బంతుల్లో 14ఫోర్లు, 4సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసింది. లోయర్‌ ఆర్డర్‌లో స్నేహ రాణా(24) కూడా రాణించడంతో భారతజట్టు 292పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు బ్రౌన్‌కు మూడు, గార్డినర్‌కు రెండు, స్కట్‌, సథర్లాండ్‌, మెక్‌గ్రాత్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.  అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ స్మృతి మంధనా అండగా నలిచింది.
మరో ఓపెనర్ ప్రతీక రావల్‌తో కలిసి శుభారంభం అందించింది. మంధాన ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించింది. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు, సిక్సర్లుగా మలుచుతూ ముందుకు సాగింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్మృతి మంధానకు దక్కింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి 1-1తో సమంగా నిలువగా మూడో, చివరి వన్డే ఢిల్లీ వేదికగా శనివారం జరగనుంది.