
* ప్రాంతీయ పార్టీలోనే వారసత్వ రాజకీయాలు ఎక్కువ
అసోసియేషన్ ఫర్ డెమొట్రిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఇడబ్ల్యూ) విడుదల చేసిన నివేదిక ప్రకారం వారసత్వ నేపథ్యం ఉన్న సభ్యుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 255 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండగా, వీరిలో 86 మంది అంటే 34 శాతం మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో వారసులు తక్కువగా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో అత్యధికంగా తొమ్మిది శాతం మంది వారసులున్నారు. జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ నేపథ్యం ఉన్న సభ్యులు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ప్రాంతీయ పార్టీల్లో ఎన్‌సిపి (శరద్‌పవార్), జెకెఎన్‌సిల్లో అత్యధికంగా 42 శాతం మంది ఇలాంటి సభ్యులు ఉన్నారు.
ఈ తరువాత వైఎస్‌ఆర్‌సిపిలో 38 శాతం, తెలుగుదేశం పార్టీలో 36 శాతం, టిఎంసిలో 10 శాతం, ఎఐఎడిఎంకెలో 4 శాతం మంది ఉన్నారు. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల్లోనూ చెప్పుకోదగ్గవిధంగా ఇలాంటి నేపథ్యం ఉన్నవారు ఉండటం విశేషమని నివేదిక వెల్లడించింది. పురుష సభ్యులతో పోలిస్తే, మహిళల్లో ఈ సంఖ్య భారీగా ఉందని నివేదిక తెలిపింది.
పురుష ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 18 శాత మంది ఈ నేపథ్యం ఉన్నవారు ఉండగా, మహిళల్లో ఇది ఏకంగా 47 శాతంగా ఉంది. దేశంలో మొత్తంగా 4,665 మంది పురుష ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో 856 మంది అంటే 18 శాతం మంది వారసత్వ నేపథ్యం కలిగి ఉన్నారు.
దేశంలో మొత్తంగా 539 మంది మహిళా సభ్యులు ఉండగా, వీరిలో 47 శాతం అంటే 251 మందికి ఇలాంటి నేపథ్యం ఉంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషల కంటే మహిళల్లో ఇలాంటి నేపథ్యం ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తంగా 94 మంది స్వతంత్ర ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో 23 మంది అంటే 24 శాతం మందికి ఇలాంటి నేపథ్యం ఉంది.
రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 141 మంది వారసులున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 604 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో 23 శాతం మందికి వారసత్వ నేపథ్యం ఉంది. ఆ తరువాత మహారాష్ట్రలో 129 మంది (మొత్తం 403 మంది, 32 శాతం), బీహార్‌లో 96 మంది (మొత్తం 360 మంది, 27 శాతం), కర్ణాటకలో 94 మంది (మొత్తం 326 మంది, 29 శాతం) ఉన్నారు.
జాతీయ పార్టీల్లో కాంగ్రెస్, బిజెపిలు తొలి రెండు స్థానాల్లో ఉండగా, అత్యల్పంగా సిపిఎంలో ఉన్నారు. దేశంలోని 5,204 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 21 శాతం మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే. లోక్‌సభలో అత్యధికంగా 31 శాతం మంది వారసులున్నారు. జాతీయపార్టీల పరంగా కాంగ్రెస్‌లో 32 శాతం, బిజెపిలో 18 శాతం సభ్యులు ఉన్నారు.
దేశంలో వారసత్వ నేపథ్య రాజకీయాలను ‘వ్యవస్థ నిర్మాణాత్మక లక్షణం’గా నివేదిక వర్ణించింది. గెలుపు సామర్థ్యం, రోజురోజుకూ పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం, రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి కారణాలతో దేశ రాజకీయాల్లో వారసత్వ నేపథ్యం ఉన్న అభ్యర్థులు పట్టు బలంగా ఉందని, పార్టీలు కూడా సీట్ల కేటాయింపులో వీరికే ప్రాధాన్యతను ఇస్తున్నాయని నివేదిక తెలిపింది.
More Stories
రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!
రష్యా ఆర్మీలోకి బలవంతంగా భారతీయ యువత
ఆసియా కప్ బాయ్‌కాట్ అంటూ బెట్టు చేసి తోకముడిచిన పాక్