
ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు ఘజియాబాద్‌లోని ట్రోనికా నగరంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మృతులను రవీంద్ర అలియాస్ కల్లు, అరుణ్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ రోహిత్ గొడారా-గోల్డ్ బ్రార్ గ్యాంగ్‌లో చురుకైన సభ్యులని, వీరిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ నెల 12న బైక్‌పై వచ్చిన వీరిద్దరూ దిశా పటానీ ఇంటి బయట కాల్పులు జరిపారు. వీరు ఉపయోగించిన బైక్ ఆధారంగా పోలీసులు వీరి కదలికలు గుర్తించారు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్సు, ఢిల్లీ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో వీరి జాడను పసిగట్టారు. వారిని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం విఫలమైంది. పోలీసులు చేరుకున్న విషయం తెలిసిన నిందితులు కాల్పులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణలో పోలీసులు కూడా ప్రతిదాడి చేశారు.
ఈ ఎదురుకాల్పుల్లో నిందితులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన రవీంద్ర, అరుణ్‌లను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు తుపాకులు, భారీ మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిందితులు కాల్పులకు వినియోగించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ సాక్ష్యాలు కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ నెల 12న దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి జగదీశ్ పటానీ లక్ష్యంగా ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు.
ఈ కేసుపై గట్టి స్పందన వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుంటామని ఆమెకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన మరుసటి రోజే నిందితుల ఎన్‌కౌంటర్ జరగడం విశేషంగా మారింది. ఈ ఘటన తర్వాత యూపీ ప్రభుత్వం నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా బరేలీ ఘటనలో పోలీసులు చూపిన వేగవంతమైన చర్యతో ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారన్న నమ్మకం మరింత బలపడింది.
More Stories
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
ఢిల్లీ యూనివర్సిటీలో ఎబివిపి అభ్యర్థులకు ట్రంప్ ప్రచారం!
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం