ఆగస్టులో సుంకాలతో అమెరికాకు తగ్గిన ఎగుమతులు

ఆగస్టులో సుంకాలతో అమెరికాకు తగ్గిన ఎగుమతులు

ట్రంప్ యంత్రాంగం విధించిన అధిక టారిఫ్‌లతో భారత్‌ నుండి అమెరికాకు ఎగుమతులు పడిపోయాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ ( జిటిఆర్‌)  తెలిపింది. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల ధరలు అక్కడ భారీగా పెరగడంతో మన ఎగుమతులు పడిపోయాయి. జులై నెలలో 16.3శాతంగా ఉన్న ఎగుమతులు, ఆగస్టు నాటికి 6.7బిలియన్‌ డాలర్లకు క్షీణించాయని తెలిపింది.

ఆగస్ట్‌ 27 నుండి 50శాతం టారిఫ్‌లు అమల్లోకి వస్తాయన్న ప్రకటనతో  2025లో అత్యంత తీవ్రమైన నెలవారీ పతనం రికార్డయిందని పేర్కొంది. జులైలో ఎగుమతులు జూన్‌తో పోలిస్తే 3.6శాతం తగ్గి 8బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. జూన్‌ నెలలో కూడా మేతో పోలిస్తే 5.7శాతం తగ్గి 8.3 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఎగుమతుల్లో వృద్ధి నమోదైన చివరి నెల మేనెల. మేలో అమెరికాకు ఎగుమతులు ఏప్రిల్‌తో పోలిస్తే 4.8శాతం పెరిగి 8.8బిలియన్‌ డార్లకు చేరుకున్నాయి.

ఏప్రిల్‌లో 8.4 బిలియన్‌ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌లతో అమెరికాకు భారతదేశ ఎగుమతులు భారీగా క్షీణించాయని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధంగా టారిఫ్‌లు కొనసాగితే, భారత ఎగుమతులకు 30-35బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. 

భారతదేశ వస్తువలు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 20 శాతం ఉండటంతో ఇది అతిపెద్ద దెబ్బ అని చెప్పారు. ప్రభుత్వం ఎగుమతిదారులకు అవసరమైన మద్దతు చర్యలను చేపట్టాలని కేంద్రానికి  సూచించారు. త్వరగా ఉపశమనం లేకుండా, సుదీర్ఘమైన టారిఫ్‌ల ప్రభావం ఉద్యోగాల్లోనూ నష్టాలకు దారితీస్తుంది. 2026 నాటికి దాని వాణిజ్య పనితీరును బలహీనపరుస్తుందని హెచ్చరించారు.