* కేంద్ర హోంమంత్రి లేదా ప్రతినిధులతో చర్చలకు మావోయిస్టులు సిద్ధం
ఒక వంక, మార్చ్, 2026 నాటికీ దేశంలో మావోయిస్టులను నిర్ములించేందుకు కేంద్ర, రాష్ట్ర సాయుధ దళాలు చురుకుగా అభేద్యమైన అడవులలోకి చొచ్చుకు వెడుతూ, వరుసగా ఎన్కౌంటర్లు జరుపుతూ ఉండగా, మరోవంక మావోయిస్టు నేతలు చేతులెత్తేస్తున్నారు. ఆయుధాలు విడిచిపెట్టేందుకు మావోయిస్టు పార్టీ సిద్ధమైంది. మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల దృష్ట్యా.. ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి, సీనియర్ పోలీస్ అధికారులు నిరంతరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా తమ పార్టీ ఆయుధాలను వదులు కోవాలని నిర్ణయించుకుంటున్నదని ఆ పార్టీ నేత అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.
సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటున్నదని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు, పోరాడుతున్న సంస్థలతో వీలైనంత వరకు కలిసి పోరాడుతామని వివరించారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రితో లేదా ఆయన నియమించిన వ్యక్తులతో లేదా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
మారిన తమ పార్టీ అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయడం తమ బాధ్యత అని, పార్టీలో ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించేవారు చర్చల్లో అంగీకరించి పాల్గొనే సహచరుల నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ప్రస్తుతం తమతో అందుబాటులో ఉన్న పరిమిత క్యాడర్, కొంతమంది నాయకత్వ సహచరులు ఈ కొత్త విధానాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పనిచేస్తున్న సహచరులతో, జైల్లో ఉన్న సభ్యులతో సంప్రదించేందుకు నెలరోజుల గడువు ఇస్తూ ‘సీజ్ ఫైర్’ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియోకాల్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
కాగా, మావోయిస్టు పార్టీలో మారిన ఈ విధానం సంచలం సృష్టిస్తున్నది. మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ బసవరాజు మృతి తరువాత ఇటీవల కొత్త నాయకత్వంలో భాగంగా ఆయన స్థానంలో తిప్పిరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదల అవ్వడం మరింత సంచలనం కలిగిస్తున్నది. అంతేకాకుండా, ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు నేత (అజ్ఞాత నేత) ఫొటోతో ఆ పార్టీ లేఖను విడుదల చేయడం దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్చానీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన ఈ లేఖ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, మావోయిస్టు ఉద్యమ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు శాంతిచర్చల పట్ల అనుకూలమైన వైఖరిని అవలంబించిన పాలక, అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు, శాంతి కమిటీ సభ్యులు, జర్నలిస్టులు, ప్రజల ముందు మావోయిస్టు పార్టీ తన మారిన వైఖరిని స్పష్టంచేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతిచర్చలకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి విజ్ఞప్తి చేస్తున్నట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది.
ఇదే ప్రతిపాదనపై మే 10న మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసినట్టు తాజా లేఖలోనూ మావోయిస్టులు తెలిపారు. అందులో తమ పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్టు ప్రస్తావించారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వానికి కాల్పుల విరమణ సైతం ప్రతిపాదించినట్టు వివరించారు. ఈ ముఖ్యమైన అంశంపై తమ పార్టీ నాయకత్వ, సహచరులతో సంప్రదించడానికి ఒక నెల రోజుల సమయం కావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.
కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోగా గత ఏడాది జనవరి నుంచి వేలాది సంఖ్యలో జరుపుతున్న సైనిక దాడిని తీవ్రతరం చేసింది. వేలాదిమంది సాయుధ పోలీస్ బలగాలను మోహరించి చుట్టుముట్టి నిర్మూలన దాడి జరిపింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మే 21న మాడ్ ఏరియాలోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకరదాడిలో ధైర్యంగా ప్రతిఘటించిన తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతోపాటు 28 మంది కేంద్ర కమిటీ సభ్యులు, సహచరులు, వారి భద్రతా సిబ్బంది అమరులైనట్టు పేర్కొన్నారు.
గతంలో జరిగిన శాంతిచర్చల ప్రక్రియను సగంలో వదిలి వేయకుండా అభయ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు, ఇందుకోసమే ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి చొరవతో ప్రారంభమైన శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్టు పేర్కొన్నారు.
More Stories
అరబ్-ఇస్లామిక్ నాటో… ఇస్లామిక్ దేశాల సైనిక కూటమి
అస్సాంలో ముస్లింలకు హిందువుల భూముల బదిలీల్లో అవినీతి!
ఆసియా కప్ నుంచి రిఫరీని తొలగించేందుకు ఐసిసి తిరస్కారం