దళితవాడల్లో టిటిడి 1000 ఆలయాలు నిర్మాణం

దళితవాడల్లో టిటిడి 1000 ఆలయాలు నిర్మాణం
దళితవాడల్లో వెయ్యి ఆలయాలను నిర్మించేందుకు  టీటీడీ పాలకమండలి తీర్మానించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఆరు ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశం నిర్ణయాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
 
ఈ ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నిధులను వినియోగించి, మతమార్పిడులను అరికట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు  నాయుడు వెల్లడించారు. ఈనెల 23న అంకురార్పణ, 24న మీనలగ్నంలో ధ్వజారోహణ జరగనుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆయన వివరించారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు 24న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, సెప్టెంబ‌రు 25న పీఏసీ- 5 వెంక‌టాద్రి నిల‌యాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా 2026వ సంవ‌త్స‌రానికి సంబంధించిన క్యాలెండ‌ర్లు, డైరీల‌ను ఆవిష్కరిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో  తిరుమలలోని ర‌ద్ధీ ప్రాంతాల్లో అద‌న‌పు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.

బ్రహ్మోత్సవాల చిత్రీకరణ కోసం ఒక ముంబయి సంస్థ ముందుకొచ్చి ఉచితంగా ఈ సేవ చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. అలాగే భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు శాటిలైట్ పిక్చర్లు తీసుకుని క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను తొలిసారి ఇస్రో పరిశీలించబోతోందని వెల్లడించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారంతో శాట్లైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను లెక్కించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పది రోజులపాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దివ్యాంగులు, వ‌యోవృద్ధులు, ఎన్ఆర్ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని, బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ప‌రిమితం చేశామని వెల్లడించారు. ప్రతి రోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.

ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా 27వ తేదీ రాత్రి 9 గంట‌ల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంట‌ల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, అలిపిరి, శ్రీవారి మెట్టు న‌డ‌క దారులు 28వ తేదీన రోజంతా తెరిచే ఉంటాయని వెల్లడించారు. కాగా, టీటీడీపై నిరాధార ఆరోపణలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నామని నాయుడు వెల్లడించారు. టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నించే ఎవరైనా ఉంటే, వారిని జైలుకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.