ఆసియా క‌ప్ నుంచి రిఫ‌రీని తొలగించేందుకు ఐసిసి తిరస్కారం

ఆసియా క‌ప్ నుంచి రిఫ‌రీని తొలగించేందుకు ఐసిసి తిరస్కారం
ఆసియా క‌ప్ నుంచి మ్యాచ్ రిఫ‌రీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొల‌గించాల‌న్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మంగళవారం తిరస్కరించింది. భార‌త్‌- పాకిస్తాన్ మ్యాచ్‌ త‌ర్వాత క‌ర‌చాల‌నం వివాదం తెర‌పైకి వచ్చింది. టాస్ స‌మ‌యంలో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌ర‌చాల‌నం చేయ‌వ‌ద్ద‌ని పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘాను రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పిన‌ట్లుగా పీసీబీ ఆరోపించింది. 
 
ఈ మేర‌కు పీసీబీ విజ్ఞ‌ప్తిని ప‌రిశీలించిన ఐసీసీ ఆ త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని పాక్ బోర్డుకు వెల్ల‌డించింది. పైక్రాఫ్ట్‌ను తొల‌గించేది లేద‌ని పీసీబీకి ఐసీసీ వ‌ర్త‌మానం పంపంది. అప్పీల్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. బుధ‌వారం యూఏఈతో జ‌రిగే పాక్ చివ‌రి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లోనూ పైక్రాఫ్ట్ రిఫ‌రీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మ్యాచ్ త‌ర్వాత ఇద్ద‌రు కెప్టెన్లు క‌ర‌చాల‌నం చేయ‌బోర‌ని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని ప‌లువురు అధికారుల‌తో పాటు పీసీబీ డైరెక్ట‌ర్‌కు కూడా తెలుస‌ని ప‌లు నివేదిక‌లు తెలిపాయి. 
 
అయిన‌ప్ప‌టికీ పీసీబీ, పీసీబీ చైర్మ‌న్ ఈ వ్య‌వ‌హారాన్ని పెద్ద‌ది చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. పీసీబీ భార‌త ఆట‌గాళ్లు, మ్యాచ్ రిఫ‌రీపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. పైక్రాఫ్ట్ సూచ‌నల మేర‌కు ఇద్ద‌రు కెప్టెన్ల మ‌ధ్య షీట్ మార్పిడి జ‌రుగ‌లేద‌ని పాక్ జ‌ట్టు మేనేజ్ న‌వేద్ చీమా ఆరోపించారు. ఇది సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌క్రియ అని, సూర్యకుమార్ యాదవ్‌తో కరచాలనం చేయవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు పైక్రాఫ్ట్ సూచించాడని చీమా పేర్కొన్నారు.
 
ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడానికి నిరాక‌రించి భార‌త ప్లేయ‌ర్లు ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని పీసీబీ ఆరోపించింది. పైగా,  పైక్రాఫ్ట్‌ను తొల‌గించ‌క‌పోతే యూఏఈతో జ‌రిగే మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని పీసీబీ హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలో బుధవారం యూఏఈతో మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. అయితే, పీసీబీ బెదిరింపులకు ఐసీసీ లొంగ‌లేదు.  ఇందులో పైక్రాఫ్ట్ పాత్ర ఏం లేద‌ని ఐసీసీ భావించింది. ఈ విష‌యంలో ఏసీసీ కూడా స‌మాచారం ముందే తెలిసిన‌ట్లుగా తేల‌డంతో ఐసీసీ ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించింది.
 
టాస్‌ సందర్భంగా గానీ, మైదానంలో ఆడేప్పుడు గానీ దాయాదులతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించిన టీమ్‌ఇండియా..  ఆట ముగిశాక కూడా పాక్‌ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ ఇవ్వకుండానే డగౌట్‌కు చేరింది. పాక్‌ ప్లేయర్లు మైదానంలో వేచి చూసినా భారత డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి అలాంటి స్పందనేమీ రాలేదు. దీంతో అవమానానికి గురైన పాకిస్థాన్‌ ఐసీసీ తలుపు తట్టింది. 
 
ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. భారత ఆటగాళ్ల చర్యకు మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను బాధ్యుడిగా చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీని డిమాండ్‌ చేసింది. మిగిలిన మ్యాచ్‌లకు అతడిని తప్పించకపోతే టోర్నీ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది.