ప్రపంచ కప్ విజేతలకు ఈడీ సమన్లు

ప్రపంచ కప్ విజేతలకు ఈడీ సమన్లు

భారత మాజీ క్రికెటర్లు, వరల్డ్కప్ విజేతలు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న ఊతప్ప, 24న యువరాజ్ సింగ్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వారితో పాటు సినీ నటుడు సోను సూద్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

ఈ నలుగురు ఆటగాళ్లు ‘1xబెట్’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారు చాలా మంది వ్యక్తులను, పెట్టుబడిదారులను కోట్లాది రూపాయలు మోసం చేశారని లేదా పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేసినట్లు చెబుతున్నారు. ఈ విచారణ అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించినది కాబట్టి, యువీ, ఊతప్ప వాంగ్మూలాలను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదు చేస్తారు.

గతంలో ఇదే కేసులో, టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, సురేశ్ రైనాను కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఈ ఆటగాళ్ల నుండి యాప్‌కు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాల గురించి ఈడీ సమాచారాన్ని సేకరించింది. తాజాగా యువీ, ఊతప్పకు కూడా నోటీసులిచ్చింది. ఈ నలుగురు మాజీ ఆటగాళ్లు ‘1xబెట్’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ అక్రమ బెట్టింగ్‌ యాప్‌లు అనేకమందిని లూటీ చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పెట్టుబడిదారులు మోసం చేసి రూ.కోట్లు ఎగవేసినట్లు వెల్లడైంది. 1x బెట్ వెబ్‌సైట్ ప్రకారం, గత 18 ఏళ్లుగా ఈ కంపెనీ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ స్పోర్ట్స్‌ ఈవెంట్లపై బెట్టింగ్ వేస్తే భారీ మొత్తం గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తోంది. అయితే 70 భాషల్లో ఈ యాప్‌ ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఈడీ దర్యాప్తు ప్రారంభ దశలో ఉందియ. ఈ అక్రమ యాప్ ప్రమోషన్‌లో లేదా మరేదైనా విధంగానైనా ఆటగాళ్ల పేర్లు లేదా ఫొటోలను ఉపయోగించారా అనే దానిపై ఏజెన్సీ దృష్టి పెట్టింది.

తాజాగా సమన్లు అందుకున్న యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప ఈ ఇద్దరు కూడా ఇప్పటికే క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సంవత్సరం జూలై- ఆగస్టులో ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో ఆడారు. కాగా ఈ ఇద్దరూ టీమ్ఇండియా నెగ్గిన 2007 టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యులు. 2011 వన్డే వరల్డ్కప్లోనూ యువీ విన్నింగ్ టీమ్లో మెంబర్.