జీఎస్టీ 2.0 సంస్కరణలు వృద్ధిని ప్రేరేపించే చర్య

జీఎస్టీ 2.0 సంస్కరణలు వృద్ధిని ప్రేరేపించే చర్య
జీఎస్టీ 2.0 సంస్కరణలు కేవలం పన్నుల సంస్కరణ మాత్రమే కావని, ప్రజల జీవితాన్ని సులభతరం చేసే, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించే ప్రజార్హ చర్య అని మాజీ ఎంపీ, బిజెపి జాతీయ అధికారిక ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం తెలిపారు.  ఈ నిర్ణయం వ్యాపార వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఇది వినియోగంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థను జీడీపీలో 57 శాతం భాగస్వామ్య వినియోగం ద్వారా మరింత బలపరుస్తుందని, ఇది 1991లో జరిగిన ఆర్థిక లిబరలైజేషన్ కన్నా చాలా విస్తృత ప్రభావాన్ని చూపుతోందని, ప్రజలందరికీ నేరుగా, స్పష్టంగా లాభాలు కల్పిస్తోందని ఆయన వివరించారు. స్థానికంగా తయారైన, దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువులను వాడాలని,  అది మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని,, మన వ్యాపారాలను మరింత పటిష్టం చేస్తుందని ఆయన చెప్పారు.

మొదటగా, జీఎస్టీలో రేట్లు సమతుల్యంగా మార్చడం, ఆదాయ పన్ను తగ్గింపు, ఆర్బిఐ నిబంధనలు సడలించడం, ఆర్థిక ప్రోత్సాహక చర్యలు చేపట్టడం వంటి నిర్ణయాలు మన ఆర్థిక వ్యవస్థను ప్రేరేపిస్తున్నాయని జాఫర్ ఇస్లాం వివరించారు.  అమెరికా అంచనాతో పోల్చితే గత త్రైమాసిక జిడిపి వృద్ధి రేటు 6.5 శాతం ఉండగా, వాస్తవంగా 7.8 శాతం వచ్చిందని, హై ఫ్రీక్వెన్సీ డేటా ప్రకారం జీఎస్టీ రేట్ల సమతుల్యీకరణ వల్ల, దేశంలో అంతర్జాతీయ ఎగుమతులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
మొత్తం ఆర్థిక పరిస్థితి, మాక్రో స్టెబిలిటీ అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కేవలం ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించడం మాత్రమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందని బిజెపి నేత భరోసా వ్యక్తం చేశారు. ఇది గత 11 సంవత్సరాల్లో చేపట్టిన నిర్మాణాత్మక, విధాన సంస్కరణల ఫలితం అని పేర్కొంటూ జీఎస్టీ సుదీర్ఘ ప్రభావాలను కలిగించే, చరిత్ర సృష్టించే సంస్కరణ అని చెప్పారు. ప్రధానంగా, ఇది స్వయం ఆధారిత భారత్ నిర్మాణానికి దారి తీస్తుందని, ఇది మన దేశానికి అత్యంత ముఖ్యమైన మార్గదర్శనం అని స్పష్టం చేశారు.