న్యూయార్క్‌ టైమ్స్‌పై ట్రంప్ 15 బిలియన్‌ డాలర్ల దావా

న్యూయార్క్‌ టైమ్స్‌పై ట్రంప్ 15 బిలియన్‌ డాలర్ల దావా
”అత్యంత వేగంగా క్షీణిస్తున్న న్యూస్ పేపర్” అంటూ ‘న్యూయార్క్ టైమ్స్’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఏకంగా రూ.1.32 లక్షల కోట్ల (15 బిలియన్ డాలర్లు) పరిహారాన్ని కోరుతూ ఆ పత్రికపై ఆయన పరువునష్టం దావా వేశారు. ‘న్యూయార్క్ టైమ్స్’ విపక్ష డెమొక్రటిక్ పార్టీకి కొమ్ముకాస్తూ, గత కొన్ని దశాబ్దాలుగా తనపై అబద్ధపు ప్రచారానికి తెగబడుతోందని ట్రంప్ ఆరోపించారు. 

తన గురించి, తన కుటుంబం, వ్యాపారాల గురించి, అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) ఉద్యమాల గురించి, అమెరికా గురించి ఆ పత్రిక అవాస్తవాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ‘న్యూయార్క్ టైమ్స్’‌పై పరువు నష్టం దావా వేసిన గొప్ప గౌరవం తనకు దక్కిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రోజు తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు.

”అమెరికా చరిత్రలోనే అతిచెడ్డ న్యూస్ పేపర్ ‘న్యూయార్క్ టైమ్స్’. అది అత్యంత వేగంగా క్షీణిస్తోంది. రాడికల్ వామపక్ష వాదులతో కూడిన డెమొక్రటిక్ పార్టీకి ఆ పత్రిక వంతపాడుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా అది నన్ను లక్ష్యంగా చేసుకుంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా నా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారంతో కథనాలను ప్రచురిస్తోంది. అందుకే నేను దానిపై ఫ్లోరిడా రాష్ట్రంలో పరువు నష్టం దావా వేశాను” అని పేర్కొంటూ ట్రంప్ ‘ఎక్స్’ వేదికగానూ ఒక పోస్ట్ పెట్టారు.

”గతంలో ఏబీసీ, సీబీఎస్‌ మీడియా సంస్థలు కూడా నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాన్నే చేశాయి. ఈవిధంగా దుష్ప్రచారానికి తెగబడటం ఆమోదయోగ్యం కాదు. అది చట్టవ్యతిరేకం కూడా. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో నా ప్రత్యర్ధి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ కోసం ‘న్యూయార్క్ టైమ్స్’ ఎంతో ప్రచారం చేసింది. నిత్యం ఆ పత్రిక మొదటిపేజీలో కమలా హ్యారిస్‌ వార్తలు పబ్లిష్ అయ్యేవి. అది అమెరికా చరిత్రలోనే ఏకైక అతిపెద్ద ఎన్నికల అక్రమ ప్రచారం” అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

”నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ నెట్‌వర్క్‌లపై పోరాటం కొనసాగుతోంది. డిస్నీకి చెందిన ఏబీసీ న్యూస్ ఛానల్‌లో ప్రసారమయ్యే జార్జ్ స్లొపాడోపౌలస్ షో, పారామౌంట్‌కు చెందిన సీబీఎస్ ఛానల్‌లో ప్రసారమయ్యే 60 మినట్స్‌ షోలలో నాపై దుష్ప్రచారం జరిగేది. నాకు వ్యతిరేకంగా ఆ ఛానళ్లు తప్పుడు డాక్యుమెంట్లు, వీడియోలు, ఫొటోలను చూపించేవి” అంటూ గుర్తు చేశారు. 

“ఆ మీడియా సంస్థలు నాపై మకిలి ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయాయి. నాకు భారీగా మూల్యాన్ని చెల్లించుకొని వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాయి. ఈ పోరాటాన్ని సాగించే క్రమంలో ఇప్పుడు ‘న్యూయార్క్ టైమ్స్’పై దావా వేసినందుకు గర్వంగా ఉంది. నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు, వదంతులను వ్యాప్తి చేసేందుకు గతంలో ఆ పత్రికకు స్వేచ్ఛ ఇచ్చారు” అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, తనను డొనాల్డ్ ట్రంప్ లైంగికంగా వేధించారంటూ అమెరికా మహిళా జర్నలిస్ట్ ఈ జీన్ కెరోల్ గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన దిగువ కోర్టు 2023 మేలో తీర్పు ఇచ్చింది. ఈ జీన్ కెరోల్‌ను లైంగికంగా వేధించడంతో పాటు ఆమె పరువుకు ట్రంప్ నష్టాన్ని కలిగించారంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకుగానూ ఆమెకు రూ.44 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. దీనిపై ఎగువ కోర్టులలో ట్రంప్ సవాల్ చేయగా, ఆయనకు చుక్కెదురైంది.