తెలంగాణ విమోచన అనేది మన చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పటికీ మరుగున పడటం సమంజసం కాదని మాజీ గవర్నర్ సిహెచ్ సీ.హెచ్ విద్యాసాగర్ రావు హెచ్చరించారు. భాస్కర యోగి రచించిన “సెప్టెంబర్ 17 – ముమ్మాటికీ విమోచనే” గ్రంధాన్ని బిజెపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ 17 సెప్టెంబరు విమోచన దినం ప్రాముఖ్యతను పిల్లల పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు.
కోమరం భీం, షోయబుల్లా ఖాన్ వంటి అనేకమంది మహనీయుల విగ్రహాలు హైదరాబాద్ నగరంలో ప్రతిష్టించాలనే డిమాండ్ తో బిజెపి చాలాకాలంగా ఉద్యమం కొనసాగిస్తున్నదని తెలిపారు. 1998లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఉద్యమాన్ని ప్రారంభించుకున్నామని చెబుతూ అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పారు.
పార్టీలకు అతీతంగా నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం గొప్పగా సాగిందని, అనేకమంది త్యాగాలు చేశారని పేర్కొంటూ ఈ 17 సెప్టెంబర్ ను ఎందుకు జరుపుతున్నామన్న అనుమానాలకు సరైన సమాధానం భాస్కర్ యోగి ఇచ్చిన చిన్న ఉదాహరణలో ఉందని తెలిపారు. 17 సెప్టెంబర్ పై కొంతమంది కుహనా లౌకిక వాదుల వాదనలను మనం అంగీకరించనక్కర్లేదని విద్యాసాగరరావు స్పష్టం చేశారు.
ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ సంస్థానానికి విమోచనం జరిగిందని, పోలీస్ యాక్షన్ ను సులభతరం చేయడానికి, గ్రామీణ స్త్రీ-పురుషులు, నిరక్షరాసులు కూడా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వాలు, నిజాం ప్రభుత్వంలో పోరాటం చేసినవారిని జైలులో ఉంచడానికి అనేక ప్రయత్నాలు చేశాయని, అండమాన్-నికోబార్‌లోని జైలు, నల్లమల ఫారెస్ట్‌లో, కాలాపానీలలో చాలా మంది పోరాటయోధులను ఉంచారని వివరించారు.
హైదరాబాద్ 15 ఆగస్ట్ 1947 నుంచి 17 సెప్టెంబర్ 1948 వరకు నిజాం పాలన కింద ఉండగా, ఆ తర్వాత పోలీస్ యాక్షన్ ద్వారా మాత్రమే విమోచన పొందిందని మాజీ గవర్నర్ స్పష్టం చేశారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాలను కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారికంగా ఆవిష్కరించనున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
18వ, 19వ శతాబ్దాల్లో హైదరాబాద్ లో అనేక నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారని, కానీ, వారి కృషిని, చరిత్రను భావితరాలకు తెలియజేయడంలో నిర్లక్ష్యం జరిగిందని విద్యాసాగరరావు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విముక్తి పోరాటంలో కీలక కేంద్రంగా ఉన్నదని చెప్పారు.
తెలంగాణలో అనేక దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయని, 1969లో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలను కోల్పోయారని, ఆంధ్రప్రదేశ్‌తో కలిసిన తర్వాత కూడా సామాజిక విభేదాలు, అన్యాయాలు కొనసాగాయని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాల, విభిన్న కులాల యువతకు విద్య, అభివృద్ధి కోసం మార్గదర్శనం అవసరమని ఆయన చెప్పారు.ఈ యువతకు సరైన దిశా నిర్దేశం ఇవ్వకపోతే, వారు సవాళ్లను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ యువతకు స్పష్టమైన దిశా నిర్దేశం ఇవ్వడం, వారికి అవగాహన, సాధన అవకాశాలు అందించడం అత్యంత అవసరం అని తెలిపారు.
17 సెప్టెంబర్ అంటే కేవలం జెండా వందనం, మిలిటరీ పరేడ్, సెల్యూట్ చేయడం మాత్రమే కాదని, ఇది తెలంగాణ విమోచన, స్ఫూర్తి ప్రతీక అని విద్యాసాగరరావు తెలిపారు. ఈ రాష్ట్రం తాము పోరాడి తెచ్చుకున్నామని, ఎవరో మనకు ఇచ్చింది కాదని యువతలోనూ ఈ భావన ఉండాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరిస్తున్నందున ఈ పోరాటాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు కూడా పాల్గొన్నారు.
More Stories
తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి వైపు చూస్తున్న నేపాల్
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం