బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం

బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టుకు కౌంటర్‌గా భారత్‌ కూడా మెగా డ్యామ్ పనులకు శ్రీకారం చుట్టింది. చైనా ప్రాజెక్టుపై భారత్‌, బంగ్లాదేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్‌ మొండిగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చైనాకు దీటుగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబాంగ్‌ నదిపై దేశంలోనే అతిపెద్ద మెగా డ్యామ్ నిర్మిస్తోంది. జల విద్యుత్‌ కేంద్రంతో పాటు డ్రాగన్‌ విడుదల చేసే వరదను తట్టుకునేలా డ్యామ్ ను నిర్మించనుంది. 

భారత సరిహద్దుల్లో టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక భద్రతలో భాగంగా భారత్‌ కూడా మెగా డ్యాంకు శ్రీకారం చుట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిబాంగ్‌ నదిపై రూ. 17వేల కోట్లతో మెగా డ్యాంను నిర్మిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  2032 కల్లా ఈ మెగా డ్యాంను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు సాగుతున్నాయి. 

టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఇటీవల భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనిపై భారత్‌, బంగ్లాదేశ్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి.  చైనా జల విద్యుత్‌ ప్రాజెక్టు ప్రభావం దిగువన ఉన్న దేశాలపై పడుతుందని భారత్‌ ఆందోళన వ్యక్తంచేసింది. చైనా ప్రాజెక్టు పూర్తైతే భారత్‌లోని బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. 

ఈ ప్రాజెక్టును వాటర్‌ బాంబుగా వినియోగించుకొని, భారత్‌లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదముందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.  భారత్‌ ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్‌ మాత్రం మొండిగా ముందుకుపోతుంది. ఈ క్రమంలోనే అరుణాచల్‌లో మెగా డ్యాం నిర్మాణానికి గతేడాది ముఖ్యమంత్రి పెమా ఖండూతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు.

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న జలవిద్యుత్‌ ప్రాజెక్టు నుంచి వచ్చే వరదను తట్టుకునే విధంగా భారత్‌ మెగా ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది.  ఈప్రాజెక్టు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తితో పాటు హఠాత్తుగా చైనా విడుదల చేసే వరదను నిల్వ చేసుకునేలా మల్టిపర్పస్‌ విధానంతో డిజైన్లు చేసినట్లు నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పోరేషన్‌ వెల్లడించింది. 278 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ ఆనకట్ట దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని తెలిపింది. సుమారు 11,223 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది.