
* నాటో, జీ7 దేశాలకు చైనాహెచ్చరిక
అమెరికా సూచించినట్లు నాటో, జీ7 దేశాలు తమపై సుంకాలు విధిస్తే ప్రతిచర్యలు తప్పవని చైనా హెచ్చరించింది. రష్యాతో సహా ప్రపంచ దేశాలతో తమకు సాధారణ ఆర్థిక, ఉత్పత్తి సహకార సంబంధాలు ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జిన్ తెలిపారు. ఈ సంబంధాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమెరికా చర్యలు ఏకపక్ష బెదిరింపులు, ఆర్థిక బలప్రదర్శనకు నిదర్శనమన్న ఆయన, అవి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
“రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే నెపతంలో చైనాతోపాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు పిలుపునిచ్చారు. కేవలం ఏకపక్షంగా మమ్మల్ని వేధించేందుకు, ఆర్థిక బలప్రదర్శన చేసేందుకు అమెరికా ఇలాంటి చర్యలు చేపడుతోంది” అని చైనా విదేశాంగాశాఖ ప్రతినిధి లిస్ జిస్ విమర్శించారు.
అయితే అమెరికా చెప్పినట్లు తమపై ఎవరైనా టారిఫ్లు విధిస్తే, తాము కూడా ప్రతిచర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మాడ్రిడ్లో సోమవారం నుంచి అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య చర్చలు మొదలైన వేళ, లిన్ జిన్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. రోజువారీ సాధారణ ప్రెస్ బ్రీఫింగ్లో భాగంగా లిన్ జిన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా “ప్రపంచంలోని చాలా దేశాలలానే చైనాకు కూడా రష్యాతో సాధారణ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇవి పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉన్నాయి. అమెరికా చర్యలు ఏకపక్ష వేధింపులకు, ఆర్థిక బలప్రదర్శనకు నిదర్శనం. ఇలాంటివి అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తాయి. అంతేకాదు ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక పంపిణీ వ్యవస్థపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది” అని పేర్కొన్నారు.
“భయపెట్టడం, ఒత్తిడి చేయడం లాంటివి సమస్యలను పరిష్కరించలేవు. ఈ విషయం ఎప్పుడో నిరూపితం అయ్యింది. ఇక ఉక్రెయిన్ విషయంలో చైనా విధానం చాలా స్పష్టంగా ఉంది. కేవలం చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఆచరణ యోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. అంతేకానీ ఏకపక్ష ఆంక్షలు, బెదిరింపులకు చైనా ఎప్పుడూ వ్యతిరేకం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నాయి’ అని లిన్ జిన్ తెలిపారు.
కాగా, నాటో దేశాలు అన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని ట్రంప్ శనివారం పిలుపునిచ్చారు. అంతేకాదు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై 50-100 శాతం సుంకాలు విధించాలని కోరారు. అమెరికా కూడా ఈ దిశగా ఆలోచిస్తోందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో చైనా, భారత్ వంటి దేశాలపై సుంకాలు విధిస్తే, రష్యాకు నిధులు ఆగిపోతాయని, దీని వల్ల ఉక్రెయిన్ యుద్ధం కూడా నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
అయితే, కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుండడం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఓ పోస్ట్ పెట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో కొరవడిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
More Stories
తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి వైపు చూస్తున్న నేపాల్
డల్లాస్లో భారత సంతతి వ్యక్తి హత్య ఖండించిన ట్రంప్
గ్రాండ్ స్విస్ విజేత వైశాలి.. వరుసగా రెండో టైటిల్