యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800

యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800
యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయమై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచిస్తూ ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే రైతుకు ప్రతి కట్టకు నేరుగా 800 రూపాయలు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ఈ ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు.
 
అమరావతి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.  ఏపీలో క్యాన్సర్ టాప్ ఫైవ్ రోగాల జాబితాలో ఉందని చెబుతూ యూరియా ఇదే విధంగా ఎక్కువగా వాడకం కొనసాగితే క్యాన్సర్​లో నెంబర్-1 రాష్ట్రంగా నిలిచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది నుంచి యూరియా ఎంతవరకు అవసరమో, అంతవరకే బ్యాలన్స్ డ్​గా వాడేలా చూడాలని అధికారులను కోరారు.
 
మైక్రోన్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలని పేర్కొంటూ యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి పంజాబ్​ రాష్ట్రాన్ని కేస్ స్టడీగా తీసుకోవాలని ఆదేశించారు.  పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని తెలిపారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని తెలిపారు. 
 
యూరియా కొరత లేదని, అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామని ముఖ్యమంత్రి సూచించారు. మన రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నందున మిరప చైనా నుంచి తిప్పి పంపారని, అక్వాలో కూడా అదే జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. కొన్ని ఐరోపా దేశాలు మన ఉత్పత్తులు ధరలు తగ్గిస్తున్నాయని వ్యాఖ్యానించారు.  ప్రజలు తినే ఫైన్ వెరైటీలు వేయాలని, లేకపోతే ఎవ్వరూ తినరని చెబుతూ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయని, కార్పొహైడ్రెట్స్ తగ్గిస్తున్నారని తెలిపారు. ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటర్న్​ గిఫ్ట్ ఇస్తోందని వెల్లడించారు.  జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకంగా ఉందని,  దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలమని అభిప్రాయపడ్డారు.
కలెక్టర్లు బ్యూరోక్రాటిక్‌గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని విధానాలను అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ సంతృప్తి స్థాయే కొలమానం అవుతుందని తేల్చిచెప్పారు.  సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్- డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు.

సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవల్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.