
* కేంద్ర కమిటీ సభ్యుడు సహ్‌దేవ్ సోరెన్ మృతి
వరుస ఎన్‌కౌంటర్లతో పెద్ద ఎత్తున క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని హజరీబాఘ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతిచెందారు. చనిపోయిన వారిలో తూర్పు భారత్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహ్‌దేవ్ సోరెన్ ఉన్నారు. ఆయన తలపై కోటి రూపాయల నజరానా ఉంది.
సోమవారం తెల్లవారుజామున హజారీబాగ్ జిల్లాలోని గిర్ది-బొకారో సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారతో కోబ్రా బెటాలియన్, స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటల సమయంలో కరండి గ్రామ సమీపంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించిన మావోయిస్టులు దాడి చేశారు.
ప్రతిగా భద్రతా బలగాలు కౌంటర్ ఫైరింగ్ ప్రారంభించాయి. రెండు వైపులా కాల్పులు తీవ్రంగా జరిగాయి. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి మావోయిస్టులు అక్కడే కుప్పకూలారు.ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ మృతి చెందాడు. అతను మోస్ట్ వాంటెడ్ నేతగా గుర్తించారు. భద్రతా బలగాలకు ఇది పెద్ద విజయంగా భావిస్తున్నారు. సహదేవ్‌తో పాటు జోనల్ కమిటీ సభ్యుడు బిర్సేన్ గంఝూ అలియాస్ రామ్‌ఖేలవాన్, బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హెబ్రామ్ అలియాస్ చంచల్ కూడా మృతిచెందారు.
బిహార్-ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చంచల్ తలపై రూ. 25 లక్షలు, జోనల్ కమిటీ మెంబరైన బిర్సేన్ గంఝు అలియాస్ రామ్‌ఖేల్వాన్‌పై రూ. 10 లక్షల బౌంటీ ఉన్నట్లు భద్రతాబలగాలు తెలిపాయి. ఘటనాస్థలి నుంచి మూడు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాబలగాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ అనంతరం ముగ్గురి మృతదేహాలను స్వాదీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ విజయంతో మావోయిస్టు నెట్‌వర్క్‌కు మరోసారి బలమైన దెబ్బ తగిలింది. సహదేవ్ సోరెన్ వంటి కీలక నేత మృతిచెందడం మావోయిస్టు శక్తిని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇంకా అక్కడ ఎవరైనా మావోయిస్టులు దాగి ఉన్నారా అని పరిశీలిస్తున్నారు.
More Stories
జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్ హోమ్స్
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?