
మహిళల నేతృత్వంలో సాధించే అభివృద్ధి, చిన్నారుల సంక్షేమాలే ‘వికసిత్ భారత్’ విధానాలకు పునాదులవుతాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.
అనేక రంగాల్లో వారు తమ ప్రతిభను చాటుతున్నారని, ఆడబిడ్డలు విద్యావంతులై, స్వావలంబన సాధించినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని స్పష్టం చేశారు.
తిరుపతిలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్లమెంటరీ, అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు పార్లమెంటు సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ‘మన కుమార్తెలు చదువుకొని స్వయం ఆధారితులైతేనే భారతదేశం సమగ్రాభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని ఓం బిర్లా పేర్కొన్నారు.
‘నారీ శక్తి వందన్’ చట్టమనేది కేవలం ప్రాతినిధ్యం కోసమే కాదని, ప్రజాస్వామ్యంలో మహిళలకు తగిన స్థానం కల్పించే దిశగా ఆ చట్టం ఓ చరిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. మహిళా సాధికారత అనేది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియగా పేర్కొన్నారు. దీనికోసం కొత్త చట్టాలు, విధానపరమైన సంస్కరణలు జరుగుతూనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీతోపాటు దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల మహిళా కమిటీల సభ్యులు హాజరయ్యారన్నారు.
మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని స్పష్టం చేస్తూ దేశ సామాజిక ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని ఓం బిర్లా తెలిపారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆదినుంచీ భారత సంప్రదాయంగా కొనసాగుతోందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో మహిళలు కీలకపాత్ర పోషించారని, సామాజిక బంధనాలు చేధించుకుని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
రెండు రోజుల సదస్సు మహిళా ఆధ్వర్యంలోని అభివృద్ధి అనే ప్రధాన అంశంపైనే జరుగుతుందని తెలిపారు. లింగానుసార అనుకూల బడ్జెట్, కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలకు సాధికారత అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయని వివరించారు.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ మాట్లాడుతూ తిరుపతిలో జరుగుతున్న తొలి జాతీయ మహిళా సాధికార సదస్సు మహిళా స్వశక్తీకరణపై లోతైన చర్చలకు వేదికగా నిలిచిందని కొనియాడారు. భారత రాజ్యాంగం మహిళల హక్కులకు బలమైన పునాదులు వేసిందని చెప్పారు. పార్లమెంటరీ కమిటీలు,చట్టాల్లో మార్పులు, విధానాల సరళీకరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో విశేష కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీ ఛైర్‌పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, డిజిటల్ అక్షరాస్యత వంటి రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడంలో సమానత్వం, సమ్మిళితత్వం, సాధికారత ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సమావేశం మహిళా సాధికారత కమిటీల చైర్‌పర్సన్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వారి అనుభవాలను పంచుకోవడానికి, ఉత్తమ విధానాలను మార్పిడి చేసుకోవడానికి, సవాళ్లను పరిష్కరించడానికి సూచనలు చేయడానికి అవకాశం ఏర్పడిందని ఆమె తెలిపారు.
ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ గౌరు చరితారెడ్డి, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేదు.
More Stories
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు