బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు

బాక్సింగ్‌  చాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు
వరల్డ్‌ బాక్సింగ్‌ (డబ్ల్యూ) ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ రెండు బంగారు పతకాలు సహా నాలుగు మెడల్స్‌ సాధించింది. 20 మంది బాక్సర్లతో వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన భారత్‌ నాలుగు పతకాలు మహిళల విభాగంలోనే సాధించటం విశేషం.  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో జైస్మిన్ లాంబోరియా, మీనాక్షి హుడా విజేతగా నిలిచారు.  మహిళల 48 కేజీల విభాగంలో మీనాక్షి, మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్‌ లంబోరియలు పసిడి పంచ్‌ విసిరారు.
ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో తొలుత జైస్మిన్‌ బంగారు పతకంతో మెరిసింది.  తొలి రౌండ్లో ఐదుగురు న్యాయమూర్తులు 3-2తో పొలాండ్‌ బాక్సర్‌, పారిస్‌ ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ జూలియ వైపు మొగ్గు చూపారు. డిఫెన్స్‌ను పక్కనపెట్టిన జైస్మిన్‌.. తర్వాతి రెండు రౌండ్లలో ఎదురుదాడి చేసింది. దీంతో న్యాయనిర్ణేతలు 4-1తో జైస్మిన్‌ను విజేతగా ఎంచుకున్నారు. 

మహిళల 48 కేజీల విభాగంలో కజకిస్తాన్‌ బాక్సర్‌ నజీమ్‌ రెండో రౌండ్లో 3-2తో మీనాక్షిపై పైచేయి సాధించినా, తొలి, మూడో రౌండ్లో మీనాక్షి 4-1తో ఆధిపత్యం చెలాయించింది. 4-1తో పసిడి పోరులో నెగ్గిన మీనాక్షి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన మీనాక్షి ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో ఆధిపత్యం చెలాయించింది. బ్యాక్‌ఫుట్‌పై ఉంటూ ప్రత్యర్థిపై దాడికి దిగింది. బలమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి పంచ్‌లను ఎదుర్కొని విజయం సాధించింది.

మహిళల విభాగంలో 80 కేజీల విభాగం సెమీఫైనల్లో పూజ రాణి పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌ బాక్సర్‌ చేతిలో 1-4తో ఓటమి పాలైంది. దీంతో పూజ రాణి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 80 కేజీల విభాగం ఫైనల్‌ హోరాహోరీగా సాగింది.

ఇక మెన్స్ విభాగంలో ఈసారి భారత్‌కు ఒక్క పతకం రాలేదు.  2013 తర్వాత పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం ఇదే తొలిసారి. భారత స్టార్ బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ పోరాటం మాత్రం క్వార్టర్స్‌లోనే ముగిసింది. భారీ అంచనాలతో బరిలోకిదిగిన ఈ మాజీ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్లో 0-5తో బ్యూస్ నాజ్ కకిరోగ్లు (తుర్కియే) చేతిలో చిత్తయింది.