వరద బాధిత నిధులను ఉగ్రవాదులకు మళ్లించిన పాక్‌

వరద బాధిత నిధులను ఉగ్రవాదులకు మళ్లించిన పాక్‌

ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ వేదికలపై మేకపోతు గాంభీర్యాలు పలికే పాకిస్థాన్, లోలోపల ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పాక్‌లోని అనేక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది భారత్‌. అయినా బుద్ధి మారని దాయాది దేశం తినడానికి సరైన తిండి లేకపోయినా కూడా ఉగ్రవాదానికి నిధుల కేటాయింపు మానడం లేదు. 

ఇటీవల వరద భాదితుల పేరుతో సేకరించిన నిధులను ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.  ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత వైమానిక దళం ధ్వంసం చేసిన లష్కరే  ప్రధాన క్యాంపు కార్యాలయం మర్కాజ్‌ తోయిబాను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. మరోవైపు ధ్వంసమైన లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయ విభాగాలను తొలగించడానికి దాని చుట్టూ భారీ యంత్రాలను మోహరించి ఉన్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వివరించాయి. 

దీనిని పునర్నిర్మించిన అనంతరం మళ్లీ ఉగ్రవాదులకు శిక్షణ స్థావరంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నాయి.  ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసమైన ఎల్ఈటికి ఆగస్టులో పాక్‌ ప్రభుత్వం నుంచి రూ.1.25 కోట్ల నిధులు కేటాయించగా, పునరుద్ధరణకు అయ్యే మొత్తం ఖర్చు సుమారు రూ.4.7 కోట్లకు పైగా ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. 

 వరద ప్రభావిత ప్రాంతాల సహాయం పేరుతో విరాళాలు సేకరిస్తూ ఉగ్రసంస్థలకు మళ్లిస్తోంది. 2005లోనూ పాకిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం సమయంలోనూ పాక్‌ ఇదే తరహాలో నిధులు సేకరించినట్లు భారత వర్గాలు గుర్తు చేశాయి. అప్పట్లో మానవతా సాయం పేరుతో సేకరించిన దాదాపు బిలియన్‌ డాలర్ల నగదులో దాదాపు 80 శాతాన్ని ఉగ్రసంస్థ ఎల్‌ఈటిలో మౌలిక సదుపాయాల కోసం మళ్లించినట్లు వెల్లడించాయి.

ఆగస్టు 18 నాటికి, మిగిలిన శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలను కూల్చివేసేందుకు ఎల్‌ఇటి భారీ యంత్రాలను మోహరించింది. శిథిలాలతో నిండిన మైదానాలు, క్యాడర్లు క్లియరెన్స్‌ను పర్యవేక్షిస్తున్నట్లు ఓ వీడియోలో వెల్లడైంది. ఉమ్-ఉల్-ఖురా శిక్షణా సముదాయం కూల్చివేత సెప్టెంబర్ 4కు పూర్తి చేశారు. సెప్టెంబర్ 7 నాటికి తీవ్రంగా దెబ్బతిన్న చివరి వసతి బ్లాక్ పూర్తిగా కూల్చివేశారు. మొత్తం కాంప్లెక్స్ శిథిలావస్థకు చేరుకుంది, పునర్నిర్మాణానికి ముందు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.

 
పునర్నిర్మాణాన్ని మర్కజ్ తైబా డైరెక్టర్ మౌలానా అబూ జార్, ఎల్‌ఇటి చీఫ్ ట్రైనర్ ఉస్తాద్ ఉల్ ముజాహిద్దీన్ అని కూడా పిలువబడే యూనస్ షా బుఖారీ పర్యవేక్షిస్తున్నారు. పునర్నిర్మించిన మర్కజ్‌ను ఫిబ్రవరి 5, 2026న, కాశ్మీర్ సాలిడారిటీ దినోత్సవం, ఎల్‌ఇటి వార్షిక సమావేశంతో సమానంగా ప్రారంభించాలని భావిస్తున్నారని, శిక్షణ, బోధన, కార్యాచరణ ప్రణాళికకు కేంద్రంగా పనిచేస్తుందని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి.