ప్రజల రోజువారీ జీవితంలో స్పష్టంగా జీఎస్టీ ప్రభావం

ప్రజల రోజువారీ జీవితంలో స్పష్టంగా జీఎస్టీ ప్రభావం
 
ప్రజల రోజువారీ జీవితంలో జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉదయం తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు జీఎస్టీ సంస్కరణల ఫలితాలు వినియోగదారులకు అందుతున్నాయని ఆదివారం చెన్నైలో ‘చెన్నై సిటిజెన్స్ ఫోరమ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్’ సదస్సులో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. 
 
ఈ మార్పులు సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆమె వివరించారు.  మునుపటి 12% పన్ను పరిధిలో ఉన్న 99% వస్తువులు ఇప్పుడు కేవలం 5% కేటగిరీలోకి వచ్చినట్లు సీతారామన్ వెల్లడించారు. దీని వల్ల అనేక నిత్యావసర వస్తువులు మరింత చౌకగా లభిస్తున్నాయని ఆమె చెప్పారు.  వీటివల్ల చాలా వస్తువుల ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా తగ్గిపోతాయని ఆమె చెప్పారు. ఫలితంగా అవి చౌకధరలకు ప్రజలకు లభిస్తాయన్నారు.
గత 8 నెలల పాటు లోతైన అధ్యయనం చేశాకే ఈమేరకు జీఎస్టీ సంస్కరణలు చేశామని నిర్మల తెలిపారు. ఈ విధానపరమైన మార్పులు చేసేందుకు 8 నెలల సుదీర్ఘ కసరత్తు తమకు ఎంతో దోహదం చేసిందని ఆమె వివరించారు. గత ఎనిమిదేళ్లలో జీఎస్టీ పరిధిలోకి వచ్చిన వ్యాపారుల సంఖ్య 66 లక్షల నుండి 1.5 కోట్లకు పెరిగిందని గణాంకాలతో ఆమె వివరించారు.  పన్ను విధానం పారదర్శకంగా మారడంతో తయారీదారులు, పంపిణీదారులు కూడా వ్యవస్థలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారని ఆమె చెప్పారు. 2018లో రూ. 7.18 లక్షల కోట్లు ఉన్న జీఎస్టీ వసూళ్లు ప్రస్తుతం రూ. 22.08 లక్షల కోట్లకు పెరిగాయని వెల్లడించారు. ఈ పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లాభదాయకమైందని సీతారామన్ తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పండుగలు ఉన్నందున, ప్రధాని మోదీ నిర్దేశం మేరకు దీపావళి కంటే ముందే (సెప్టెంబరు 22 నుంచి) జీఎస్టీ సంస్కరణలను అమల్లోకి తేవాలని నిర్ణయించామని ఆమె వెల్లడించారు.