ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది

ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
కాంగ్రెస్ “ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు మద్దతు ఇచ్చింది” అని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. “చొరబాట్లను ప్రోత్సహించారు,  అస్సాం జనాభా గుర్తింపును కాంగ్రెస్ పాలనలో ప్రమాదంలో పడేసింది. దశాబ్దాలుగా, కాంగ్రెస్ రాష్ట్రంలో తిరుగుబాటు, అస్థిరతను పెంచింది. అస్సాం గొప్ప వారసత్వానికి శాంతి, అభివృద్ధి, గుర్తింపును తెచ్చింది మా ప్రభుత్వమే” అని మోదీ ప్రకటించారు. 
రాజకీయ ప్రయోజనాల కోసం అస్సాంను కాంగ్రెస్ తిరుగుబాటుదారులు,   జనాభా అసమతుల్యతలోకి నెట్టివేస్తున్నారని ప్రధాని   ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అసోంలో రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దరంగ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, భారతదేశ స్వావలంబన ప్రయాణంలో అస్సాంను కీలక పాత్రధారిగా మార్చడంపై దృష్టి సారించిందని తెలిపారు.
 
భారతదేశ ఇంధన రోడ్‌మ్యాప్‌లో అస్సాం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతను సాధించడంలో దాని పాత్ర గురించి మాట్లాడారు. దేశీయ వనరులను ఉపయోగించుకోవడం, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ సముద్ర మండలాల్లో ఇంకా ఉపయోగించని చమురు, గ్యాస్ నిల్వలను అన్వేషించడానికి ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌ను ప్రారంభిస్తోందని తెలిపారు.
“1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ సర్కార్ అనేక తప్పిదాలు చేసింది. ఆ తప్పిదాల ఫలితాలను ఇప్పటికీ అసోం ప్రజలు అనుభవిస్తున్నారు. నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. నేను శివ భక్తుడిని, కనుక విమర్శల విషాన్ని దిగమింగుతా. కానీ ఎవరికైనా అవమానం జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. అసోం పుత్రుడు డాక్టర్‌ భూపెన్‌ హజారికాకు భారతరత్న ఇవ్వడం మంచి నిర్ణయమా కాదా? కానీ ఆయనకు భారతరత్న ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించింది” అంటూ మండిపడ్డారు. 

అసోంలో ఏళ్లపాటు పరిపాలన చేసిన కాంగ్రెస్​, బ్రహ్మపుత్ర నదిపై కేవలం 3 వంతెనలు మాత్రమే నిర్మించిందని, కానీ పదేళ్ల బీజేపీ పాలనలో ఇప్పటి వరకు 6 బ్రిడ్జ్​లు నిర్మించామని ఆయన పేర్కొన్నారు. “అసోం వృద్ధిరేటు ఇప్పుడు 13 శాతంగా ఉంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కృషి వల్లే ఇది సాధ్యం అయ్యింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ అసోంను హెల్త్ హబ్​ గా అభివృద్ధి పరచాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. వికసిత్ భారత్​ కలను సాధించడంలో ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద పాత్ర ఉంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

“కామాఖ్య మాత ఆశీస్సుల వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ భారత సైన్యానికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, పాకిస్థాన్ ఉసుగొల్పుతున్న ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే, కాంగ్రెస్ చొరబాడుదారులను, దేశ వ్యతిరేక శక్తులను రక్షిస్తోంది. కానీ చొరబాటుదారులు మన భూమిని ఆక్రమించుకోవడానికి బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. అసోం ముఖ్యమంత్రి ఆక్రమణదారులను తరిమివేస్తున్నారు. దీనితో రైతులు ఇప్పుడు స్వేచ్ఛగా తమ భూముల్లో సాగు చేసుకుంటున్నారు” అని మోదీ తెలిపారు.

 
దరంగ్‌ జిల్లాలో రూ.6,300కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు ఇదే జిల్లాలో మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి, నర్సింగ్‌ కళాశాల, జిఎన్ఎం పాఠశాలలకు ప్రారంభోత్సవం చేశారు. రూ.1200 కోట్లతో నరెంగి-కురువా మధ్య చేపట్టనున్న 2.9 కిలోమీటర్ల వంతెనకు శంకుస్థాపన చేశారు. రూ.4,530 కోట్లతో కమ్‌రూప్‌, దరంగ్‌ జిల్లాలతోపాటు మేఘాలయాలోని రిబోయ్‌ జిల్లాలను కలిపే 118.5 కిలోమీటర్ల రింగ్‌ రోడ్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.