
తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, భీమిలి ఎర్రమట్టి దిబ్బలు సహా దేశంలోని 7 ఆస్తులకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. మిగిలిన వాటిలో మహారాష్ట్రలోని పంచగాని, మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు (ఈస్ట్ ఖాసి హిల్స్), నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్, కేరళలోని వర్కాల సహజ వారసత్వ సంపద ఉన్నాయి.
ఈ వివరాలను యునెస్కో వెల్లడించింది. ఈ ఏడింటితో కలిపితే తాత్కాలిక జాబితాలో ఇప్పటి వరకు భారత్‌లోని 69 అంశాలకు చోటు లభించింది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ 7 శిఖరాలూ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి. అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల కొండల్లో ఒక్కో కొండది ఒక్కో చరిత్ర.
1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంత విశేషాల గురించి రాశారు. ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత మేళవించిన తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి నెలవు. అరుదైన వృక్ష, జంతుజాతులకు ఆలవాలం. ఇక్కడి వాతావరణం కూడా వైవిధ్యం. కొండలపై నిరంతరం శీతల పవనాలు వీస్తుంటాయి. తరచూ వర్షపు జల్లులు పడుతుంటాయి. అనేక జలపాతాలు కనివిందు చేస్తాయి. ఎందరో రుషులు, మునులు తపస్సునాచరించిన చారిత్రక ఆనవాళ్లు ఇక్క ఉన్నాయి. ఇక్కడి తీర్థక్షేత్రాలపై ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి.
వేల ఏళ్ల క్రితం ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా-2025లో విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలకు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తుది జాబితాలో చోటు దక్కితే ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ మరింత పకడ్బందీగా సాగుతుంది. ప్రస్తుతం భీమిలి వద్ద తీరానికి 200 మీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 నుంచి 90 మీటర్ల ఎత్తులో ఎర్రమట్టి దిబ్బలున్నాయి.
వేల సంవత్సరాలుగా గాలులకు ఎగురుతూ వచ్చిన ఇసుక రేణువులు దిబ్బలుగా మారాయి. ఇందుకు భౌగోళికంగా చోటుచేసుకున్న కొన్ని వాతావరణ మార్పులు అనుకూలించాయి. దాదాపు 6000 సంవత్సరాల కిందట వాతావరణంలో తీవ్రమైన మార్పుల నేపథ్యంలో సాగరం వెనక్కి వెళ్లింది. దీంతో అక్కడ ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. వాటిపై కురిసిన వర్షానికి, గాలుల తీవ్రతకు దిబ్బలు కరిగి లోయలుగా మారాయి.
ఈ దిబ్బలపై కన్పించే ఇసుక రేణువుల వయసు 3000 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అలానే కొద్ది రోజుల క్రితం భారతీయ సంస్కృతికి అద్దంపట్టే భగవద్గీతతోపాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. అత్యుత్తమ విలువ కలిగిన డాక్యుమెంటరీని సంరక్షించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఈనెల 17న కొత్తగా 74 డాక్యుమెంటరీలు యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చేరాయి. ఫలితంగా మొత్తం సంఖ్య 570కి చేరింది. మరోవైపు ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి.
ఏదైనా సైట్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి పరిగణించే ముందు తాత్కాలిక జాబితా కీలక పాత్ర పోషిస్తుంది. సమర్పణలను సిద్ధం చేయడంలో భారత పురావస్తు సర్వే పాత్రను యునెస్కోకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం ప్రశంసించింది. తన వారసత్వ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా, భారతదేశం తన సహజ అద్భుతాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది. సంస్కృతి, సహజ సౌందర్యం రెండింటిలోనూ గొప్ప దేశంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది.
More Stories
వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ప్రదర్శన
ఢాకా యూనివర్సిటీలో తొలిసారి ఇస్లామిస్ట్ ల విజయం
మార్చి 5న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలు