మార్చి 5న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలు

మార్చి 5న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలు
 

* నేపాల్ ప్రధానిని మొదటగా కలిసిన భారత్ రాయబారి శ్రీవాస్తవ

సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తున్నాయి. హింసాత్మక నిరసనల కారణంగా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా, దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీల కార్కీ బాధ్యతలు స్వీకరించారు.  ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికలపై అధ్యక్ష కార్యాలయం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చి 5న పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటింటింది. నూతన ప్రధాని సుశీల కార్కీ సిఫార్సు మేరకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ మార్చి 5న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.

నేపాల్ సైన్యం శనివారం ఉదయం 5:00 గంటలకు ఖాట్మండులో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలను ఎత్తివేసింది. రాజకీయ అస్థిరత మధ్య ఆంక్షలు విధించారు.  కానీ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత, సైన్యం కర్ఫ్యూను ఉపసంహరించుకుంది. అయితే, ముందు జాగ్రత్త చర్యగా మరికొన్ని రోజులు వీధుల్లో సైన్యం ఉంటుందని భావిస్తున్నారు. 

నేపాల్ ఆర్మీ ప్రతినిధి ప్రకారం, శనివారం ఎటువంటి కర్ఫ్యూలు లేదా కదలిక పరిమితులు అమలులో లేనందున, రోజువారీ జీవితం తిరిగి ప్రారంభమైంది. రోజుల తరబడి మూసివేయబడిన దుకాణాలు, మార్కెట్లు, మాల్స్ తిరిగి తెరిచారు. వాహనాలు రోడ్లపై తిరిగి కనిపించడం ప్రారంభించాయి. అశాంతి సమయంలో తగలబెట్టిన లేదా ధ్వంసం చేసిన అనేక ప్రభుత్వ భవనాలు సహా అనేక ప్రదేశాలలో శుభ్రపరిచే కార్యకలాపాలు జరుగుతున్నాయి. 

అధ్యక్ష భవనం (శీతల్ నివాస్)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే, నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ కొత్తగా నియమితులైన తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీలా కర్కిని కలిసిన మొదటి విదేశీ దౌత్యవేత్త అయ్యారు. ఈ సమావేశంలో, రాయబారి శ్రీవాస్తవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి అభినందన సందేశాలను అందించారు. ఈ సందిగ్ధ కాలంలో నేపాల్‌కు సహాయం చేయడంలో భారతదేశపు పూర్తి మద్దతును ఆమెకు హామీ ఇచ్చారు.

ఆందోళనలు హింసాత్మక మారడంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడాలనే అంశంపై జెన్‌ జడ్‌ ఆందోళనకారులు, సైన్యాధిపతి, అధ్యక్షుడు పౌడెల్‌ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే జస్టిస్‌ సుశీల పేరును ఆందోళనకారులు ప్రతిపాదించారు.  ప్రధానిగా సుశీలను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఆమె ప్రమాణం చేసి, బాధ్యతలు చేపట్టారు.

ఇక ఆదివారం కొద్ది మంది మంత్రులతో క్యాబినెట్​ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం విషయంపై జెన్​-జడ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.  అయితే హోం, విదేశాంగ, రక్షణ తదితర శాఖలు ప్రధాని చేతిలోనే ఉండనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి ఆందోళనల్లో ప్రధాని కార్యాలయానికి నిప్పుంటిచారు. ఈ క్రమంలోనే సింగ్​దర్బార్​ కాంప్లెక్స్​లో హోంశాఖ కోసం కొత్తగా నిర్మించిన భవనం నుంచి పాలన కొనసాగించేందుకు ఏర్పాట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

భవనంలో ఉన్న బూడిదను తొలగించి, చుట్టుపక్కల శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, హింసాత్మక ఘటనల్లో గాయపడి, కాఠ్‌మాండూలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సుశీలా కార్కీ పరామర్శించారు.

మరోవైపు రాష్ట్రపతి తీసుకున్న పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని నేపాల్ ప్రధాన రాజకీయ పార్టీలు, అత్యున్నత న్యాయవాదలు సంఘం ఖండించాయి. ఈ చర్యను రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షంగా ఉందని, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన దెబ్బగా అభివర్ణించాయి. రద్దయిన ప్రతినిధుల సభ ప్రధాన విప్‌లు కూడా దీనిని వ్యతిరేకిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

నేపాల్​కు అండగా ఉంటాం : ప్రధాని మోదీ

నేపాల్​కు నూతన ప్రధానిగా సుశీలా కార్కీ నియామకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్‌- నేపాల్‌లు సన్నిహిత దేశాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్​కు అండగా ఉన్నట్లు తెలిపారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వానికి కార్కీ చొరవ తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

 శనివారం మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో నిర్వహించిన సభలో ఈమేరకు ప్రసంగించారు. నేపాల్​లో జరిగిన అల్లర్లలో ముగ్గురు పోలీసులు, 19 మంది విద్యార్థులు సహా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు భారతీయ పౌరుడు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక జైళ్ల నుంచి పరారైన వారిలో ఇప్పటివరకు 70 మందిని భారత్​  సరిహద్దు రాష్ట్రాల్లో పోలీసులు పట్టుకున్నారు.