మరో 114 రఫేల్‌ విమానాలు… హైదరాబాద్‌లో ఓవర్‌హాల్‌ ఫెసిలిటీ!

మరో 114 రఫేల్‌ విమానాలు… హైదరాబాద్‌లో ఓవర్‌హాల్‌ ఫెసిలిటీ!
 
భారత వైమానిక దళం మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని రక్షణశాఖకు ప్రతిపాదనలు అందించింది. ఈ జెట్‌లను ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, టాటా వంటి భారతీయ అంతరిక్ష సంస్థలు తయారు చేస్తాయి. జాతీయ మీడియా నివేదిక ప్రకారం ఈ ప్రదిపాదన అంచనాలు రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. రాబోయే రోజుల్లో రక్షణ కార్యదర్శి నేతృత్వంలోని డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డు ఈ విషయంపై చర్చించనున్నది.
 
విమానాల భాగాల్లో 60 శాతం భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో రాఫెల్ జెట్‌ల ఎం-88 ఇంజిన్‌ల నిర్వహణ, మరమ్మతుల ఓవర్‌హాల్ ఫెసిలిటీని సైతం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఏఎన్‌ఐ తెలిపింది.  భారత వైమానిక దళం తయారుచేసిన 114 రాఫెల్ జెట్‌ల ప్రతిపాదన, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ (ఎస్ఓసి) కొద్దిరోజుల క్రితం రక్షణ మంత్రిత్వ శాఖకు అందింది. 
 
ఈ ప్రతిపాదన డిఫెన్స్‌ ఫైనాన్స్‌ సహా దాని కింద ఉన్న వివిధ విభాగాల పరిశీలనలో ఉంది. చర్చల తర్వాత ఈ ప్రతిపాదనను డీపీబీకి, ఆ తర్వాత డిఫెన్స్‌ ఆక్విజిషన్‌ కౌన్సిల్‌కు పంపుతారని రక్షణశాఖ అధికారులను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ నివేదిక తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
ఆ తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్తిసాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో రఫేల్‌ యుద్ధ విమానాలను వినియోగించిన విషయం విధితమే. ఈ క్రమంలో తాజాగా వాయుసేన ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. రఫెల్‌ యుద్ధ విమానాలు స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను ఉపయోగించి, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ పీఎల్‌-15 ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్‌ను విజయవంతంగా ఓడించాయని రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌ వద్ద 36 రఫేల్‌ జెట్స్‌ ఉన్నాయి. మరోవైపు, ఇండియన్‌ నేవి 26 రాఫెల్‌లను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చింది. అయితే, కొత్త ఆర్డర్ నేపథ్యంలో భారత డిఫెన్స్‌లోకి రఫేల్‌ జెట్ల సంఖ్య 176కి పెరగనున్నది. ప్రస్తుతం ఐఏఎఫ్‌ 4.5 జెనరేషన్‌ విమానాలు అయిన రాఫెల్స్, సుఖోయ్ Su-30, హెచ్‌ఏఎల్‌ తేజస్‌లను ఉపయోగిస్తోంది. నాల్గవ తరం యుద్ధ విమానాలు అయిన డస్సాల్ట్ మిరాజ్ 2000, మికోయన్ మిగ్-29లను సైతం వాడుతున్నది.