బ్రిటన్‌లో సిక్కు యువతిపై అత్యాచారం

బ్రిటన్‌లో సిక్కు యువతిపై అత్యాచారం
బ్రిటన్‌కు చెందిన సిక్కు యువతిపై ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి బ్రిటన్‌కు చెందిన వ్యక్తి కాదని, ఆమె దేశానికి తిరిగి వెళ్లాలని అత్యాచారానికి ముందు ఆ వ్యక్తులు బెదిరించారు. 
 
మంగళవారం ఉదయం 8.30 గంటలకు వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌ ఓల్డ్‌బరీలోని టేమ్ రోడ్ వద్ద ఉన్న పార్కులో 20 ఏళ్ల సిక్కు యువతిని ఇద్దరు శ్వేతజాతీయులు అడ్డుకున్నారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ సిక్కు యువతి బ్రిటన్‌కు చెందిన మహిళ కాదని, ఆమె దేశానికి తిరిగి వెళ్లాలని బెదిరించారు. అంతేగాక ఆ సిక్కు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా, బాధిత సిక్కు యవతి ఫిర్యాదుపై వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌ పోలీసులు స్పందించారు. జాత్యహంకార దాడిగా, ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నామని తెలిపారు. శ్వేతజాతీయులైన అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు నిందితులకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్‌, డ్యాష్‌క్యామ్‌ ఫుటేజ్‌, మొబైల్‌ ఫుటేజ్‌ వంటి ఆధారాలు అందించి సహకరించాలని ప్రజలను కోరారు.

మరోవైపు బ్రిటన్‌లోని సిక్కు సమాజం ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో జాత్యహంకార సంఘటనలు పెరుగడంపై సిక్కు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ ఈ దాడిని ఖండించారు.  ‘తీవ్ర హింస, జాత్యహంకార చర్య’ అని అభివర్ణించారు. ‘ఆమె ఈ దేశానికి చెందిన మహిళ. బ్రిటన్‌ లేదా ఓల్డ్‌బరీలో ఎక్కడా జాత్యహంకారం, స్త్రీ ద్వేషానికి స్థానం లేదు. సిక్కు సమాజానికి న్యాయం జరిగేలా, వారి భద్రతను మెరుగుపరచడానికి పోలీసులతో కలిసి పనిచేస్తా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇంగ్లాండ్ లో దక్షిణాసియా వర్గాలపై ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయనే ఆందోళనల మధ్య ఈ సంఘటన జరిగింది. వాటిలో ఇటీవల సిక్కు టాక్సీ డ్రైవర్లపై దాడులు కూడా ఉన్నాయి. ఇతర హై-ప్రొఫైల్ కేసులతో పోలిస్తే మీడియా నిశ్శబ్దం పట్ల నివాసితులు, ఆన్‌లైన్ వ్యాఖ్యాతలు నిరాశ వ్యక్తం చేశారు. 

 
రాజకీయ నాయకుల నుండి ప్రజా ఖండనలు కనిపించకపోవడాన్ని  కొందరు ప్రశ్నించారు. ఉదాహరణకు, ప్రసారకర్త నరీందర్ కౌర్ ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశారు: “ఈ విషాన్ని వేదికగా చేసుకునే రాజకీయ నాయకులు + మీడియా దీనికి పాల్పడుతున్నారు. మీరు ప్రతిరోజూ జాత్యహంకార మృగానికి ఆహారం పెట్టలేరు. మీ వైపు ఏదైనా జరిగినప్పుడు షాక్ ఇవ్వలేరు. గోధుమ రంగు వ్యక్తిపై దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదు.”