భారత్‌, చాలాపై భారీ టారిఫ్​లకు జీ7 దేశాల అంగీకారం!

భారత్‌, చాలాపై భారీ టారిఫ్​లకు జీ7 దేశాల అంగీకారం!
రష్యన్‌ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలపై ఐరోపా సమాఖ్యతో పాటు, జీ7 దేశాలు టారిఫ్‌లు విధించాలని అమెరికా చేసిన ప్రతిపాదనకు జీ7 దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.  ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగా రష్యన్‌ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలపై ఐరోపా సమాఖ్యతో పాటు, జీ7 దేశాలు టారిఫ్‌లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. 
 
శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ అయిన జీ7 దేశాల ఆర్థిక మంత్రులు సుంకాల విధింపుపై చర్చించిన్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌ వెల్లడించారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి వారంతా ముందుకురావాలని కోరారు.

ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకురావాలని యూఎస్‌ వాణిజ్య మంత్రి స్కాట్‌ బెసెంట్‌ పిలుపునిచ్చారని తెలిపారు. ఇందుకోసం మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలపై సుంకాలు విధించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఉద్ఘాటించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామని జీ7దేశాలు ప్రకటించాయని తెలిపారు. ఉక్రెయిన్‌ రక్షణకు నిధులు సమకూర్చేందుకు స్తంభించిన రష్యా ఆస్తులను ఉపయోగించే విషయంపైనా సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో అమెరికాతో కలిసి ఈ దేశాలు కూడా నిర్ణయాత్మక చర్యలు చేపడుతాయని ఆశిస్తున్నామని వెల్లడించారు.

దీంతో భారత్‌, చైనాలపై సుంకాల విధింపునకు ఆయా దేశాలు కూడా సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇంతకుముందు ఐరోపా సమాఖ్య(ఈయూ) దేశాల ముందు కూడా ట్రంప్‌ ఇలాంటి ప్రతిపాదనలే చేశారు. అయితే, ఈవిషయంలో ఈయూ దేశాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. దీంతో అది సాధ్యపడలేదు. ఇవే ప్రతిపాదనలను ఆయన మళ్లీ జీ7 దేశాల ముందుపెట్టడం గమనార్హం.