
“మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా. మీ వెంట భారత ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రంలో 7 వేల కొత్త ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇక్కడి ప్రజల మేలు కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు చెలరేగి, పలు హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడం ప్రారంభమైన 22 నెలల తర్వాత మొదటిసారిగా పర్యటించిన ప్రధాని శనివారం మణిపుర్‌లోని జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్‌పుర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
మణిపుర్ పేరులోనే మణి ఉందని అది దేశానికే మణి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇక్కడి కొండలు వెలకట్టలేని ప్రకృతి వరప్రసాదమని, ప్రజల కఠోర పరిశ్రమకు సంకేతాలని ప్రధాని కొనియాడారు. మణిపూర్ ప్రజల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని చెబుతూ మణిపూర్‌లో నూతన ఉషోదయం ప్రారంభం కానుందని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని, వారికి కేంద్రం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
కాగా, ఇంఫాల్ లోయలో నివసించే మెయితీలు, ప్రధానంగా కొండ జిల్లాల్లో నివసించే కుకి-జో కమ్యూనిటీకి కొండలు, లోయ మధ్య సామరస్య వంతెనను నిర్మించాల్సిన అవసరాన్ని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.. “మణిపూర్‌లో ఎలాంటి హింస జరిగినా దురదృష్టకరం. ఈ హింస మన పూర్వీకులకు, మన భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం. కాబట్టి, మనం మణిపూర్‌ను శాంతి, అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలి. మనం కలిసి దీన్ని చేయాలి” అని ఇంఫాల్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ పిలుపిచ్చారు.
ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలున్నాయని, ప్రస్తుతం ఇక్కడ శాంతి నెలకొంటోందని చెప్పారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైల్వే, రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్ కేటాయింపులను పెంచిందని ప్రధాని మోదీ తెలిపారు. 2014 నుంచి మణిపుర్‌లో కనెక్టివిటీని మెరుగుపరచడంపై తాను ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మణిపుర్ ధైర్యం, శౌర్యానికి నిలయంగా ఉందని ప్రశంసించిన ప్రధానమంత్రి, ఇంఫాల్ నుంచి రోడ్డు మార్గంలో చురాచంద్‌పూర్‌కు వెళ్లేటప్పుడు తనకు లభించిన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్‌లో రాలేకపోయానని, రోడ్డు మార్గంలో వచ్చానని చెప్పారు. అదికూడా మంచిదే అయిందని, మణిపూర్ యువకులు, పెద్దలు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాలతో కనిపించారని, ఈ క్షణాలను తాను జీవితంలో మరిచిపోలేని తెలిపారు. తాను నిర్వాసితులతో మాట్లాడాని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు.
కొత్త ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ పరంగా ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయని మోదీ పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేదికపై రూ. 7,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని మోదీ వెల్లడించారు. అవి మణిపుర్ ప్రజల జీవితాలను, గిరిజన వర్గాల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై తన ప్రభుత్వం దృష్టి సారించడంలో భాగంగా, రూ. 3,600 కోట్లకు పైగా విలువైన మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టుకు పునాది వేశారు.
రూ.2,500 కోట్లకు పైగా విలువైన ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టులు, మణిపుర్ ఇన్ఫోటెక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రదేశాలలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు . అంతకుముందు చురాచంద్‌పుర్ జిల్లాకు చేరుకుని అక్కడ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు మోదీ. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. 2023లో ఈ ఘర్షణలు చోటుచేసుకోగా, రెండేళ్ల తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ ఆ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి