లొంగిపోయిన మోస్ట్​ వాంటెడ్​ మావోయిస్టు సుజాతక్క

లొంగిపోయిన మోస్ట్​ వాంటెడ్​ మావోయిస్టు సుజాతక్క

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్​ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మోస్ట్​ వాంటెడ్​ సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమ బెంగాల్​లో 2011లో జరిగిన ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్​జీ భార్యనే సుజాతక్క. 

1984లో కిషన్‌జీని ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​ సౌత్​ సబ్​ జోనల్​ బ్యూరో ఇన్​ఛార్జిగా ఉన్నట్లు సమాచారం. సుజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు వివరాలను డీజీపీ జితేందర్​ వెల్లడించారు. ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు అని తెలిపారు. ఆమె మొదట్లో ఆర్​ఎస్​యూ, జన నాట్యమండలిలో పని చేసేవారని పేర్కొన్నారు.  1996లో కమాండర్​గా విధులు నిర్వహించారని, 2001లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారని చెప్పారు.

“సుజాతక్క అనారోగ్య కారణాలతో బయటికి వచ్చారు. ఆమెకు రూ.25 లక్షల రివార్డు అందిస్తాం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో జరిగిన ఎన్​కౌంటర్​లో 22 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటికే మావోయిస్టులు చాలా మంది లొంగిపోతున్నారు. ఆపరేషన్​ ఖగార్ దృష్ట్యా తమను తాము కాపాడుకునేందుకు బయటకు వస్తున్నారు.” అని జితేందర్ వివరించారు.

గతేడాది రాష్ట్రంలో జరిగిన ఎన్​కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు చనిపోయారని డీజీపీ జితేందర్​ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ ఎన్​కౌంటర్లలో 10 మంది చనిపోయారని చెప్పారు.  తెలంగాణ కమిటీలో ప్రస్తుతం 73 మంది మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్​ డీజీ శివధర్​ రెడ్డి తెలిపారు. అందులో రాష్ట్రానికి చెందినవారు 11 మంది కాగా, ఇతర రాష్ట్రాల వారు 62 మంది ఉన్నారని చెప్పారు. 

లొంగిపోయిన మావోయిస్టులపై ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉంటే వారితో మాట్లాడతామని హామీ ఇచ్ఛారు. లొంగిపోయిన మావోయిస్టుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని కోరుతామని ఆయన వివరించారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో ఉన్న ప్రధాన నేతల్లో కొందరిని ఆపరేషన్​ ఖగార్​లో భాగంగా ఎన్​కౌంటర్​లో చంపేశారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ మధ్యకాలంలో 17 మంది మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.