అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు

అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
 
భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందడం చూసి ఓర్చుకోలేని కొందరు అభద్రతా భావంతోనే అదనపు సుంకాలు విధించారని అమెరికాను ఉద్దేశించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా, మోహన్ భగవత్ తెలిపారు. మనమంతా ఆ భగవంతుడి పిల్లలమని అందరూ గ్రహిస్తే ఎలాంటి అభద్రతాభావం ఉందని స్పష్టం చేశారు.   నాగ్‌పూర్‌లో బ్రహ్మ కుమారీస్ విశ్వశాంతి సరోవర్ 7వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా జరగాలని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
 
 ‘‘మన మధ్య శత్రుత్వం లేకపోతే ఎవరూ శత్రువులు కాదు. గతంలో పాములను చూస్తే భయపడేవాళ్లం. కానీ, జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని పాములూ విషపూరితం కాదని తెలుసుకున్నాం. అప్పుడు ఆ పాములను అలాగే వదలిపెట్టడం మొదలుపెట్టాం..జ్ఞానం వల్ల భయం, వివక్ష అన్నీ తొలగిపోయాయి’’ అని తెలిపారు.
 
‘‘భారత్ అభివృద్ధి చెందితే ఏం అవుతుంది? అందుకే సుంకాలు విధిస్తారా? సప్త సముద్రాల ఆవల ఉన్న మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? కానీ, ‘నేను.. నాది’ అనే భావనతో భయపడుతున్నారు. కానీ, ఈ రోజు ప్రపంచానికి పరిష్కారం అవసరం. మీరు అసంపూర్ణ దృక్కోణంతో పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు అందుకే విఫలమయ్యారు’’ అని పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పించారు.

‘‘అంతర్జాతీయ వాణిజ్యం ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛంగా స్వచ్ఛంద సహకారంపై ఆధారపడి ఉండాలి. అందుకే మనం స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఆత్మ నిర్బర్ అంటే దిగుమతులు నిలిపివేయడం కాదు. ప్రపంచం పరస్పర ఆధారంతో నడుస్తోంది. కాబట్టి ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతాయి. కానీ, వాటిలో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.
 
మానవులు, దేశాలు తమ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాయని భగవత్ హెచ్చరించారు. బ్రహ్మ కుమారీలు అనే మహిళా నాయకత్వంలోని ఆధ్యాత్మిక ఉద్యమం మాదిరిగానే, ఆర్ఎస్ఎస్ అంతర్గత చైతన్యాన్ని మేల్కొల్పడానికి పనిచేస్తుందని ఆయన తెలిపారు.
 
“మానవులు, దేశాలు తమనిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే, వారు సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. మనం కరుణ చూపి భయాన్ని అధిగమిస్తే, మనకు శత్రువులు ఉండరు” అని ఆయన హితవు చెప్పారు. భారతదేశం గొప్పదని, భారతీయులు కూడా గొప్పగా ఉండటానికి కృషి చేయాలని చెబుతూ భారతదేశం పెద్దదని, అది పెద్దదిగా ఎదగాలని కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.