
2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 ప్రాంతీయ పార్టీలు రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. ఈ నిధుల్లో 70 శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారా అందాయి. దేశంలోని 40 ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఎన్నికల సంఘం(ఈసీ)కి సమర్పించిన ఆడిట్ నివేదికల ప్రకారం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అత్యధికంగా రూ.685.51 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ.646.39 కోట్లు, బీజూ జనతాదళ్ (బీజేపీ) రూ.297.81 కోట్లు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రూ.285.07 కోట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ రూ.191.04 కోట్ల ఆదాయంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో ఈ ఐదు పార్టీల ఆదాయం వాటా 83.17 శాతం. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం 45.77 శాతం మేర పెరిగిందని ఏడీఆర్ తెలిపింది.
ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,736.85 కోట్లుగా పేర్కొంది. టీఎంసీకి రూ. 312.93 కోట్ల మేర ఆదాయం పెరిగింది. టీడీపీ, బీజేపీ కూడా గణనీయమైన ఆదాయ పెరుగుదలను నమోదు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. బీఆర్‌ఎస్ ఖర్చు చేయని ఆదాయం రూ.430.60 కోట్లు, టీఎంసీ రూ. 414.92 కోట్లు, బీజేడీ రూ. 253.79 కోట్లు మేర ఆదాయాన్ని ఖర్చు చేయలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), జనతాదళ్ (యునైటెడ్) సహా 12 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ఆదాయం కంటే సుమారు 55 శాతం ఎక్కువ ఖర్చులు వైస్సార్ కాంగ్రెస్ చూపింది. గోవా ఫార్వర్డ్ పార్టీకి ఎలాంటి ఆదాయం లేనప్పటికీ రూ.1.56 లక్షల వ్యయం ప్రకటించింది. కాగా, బీఆర్ఎస్, టీఎంసీ, బీజేడీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, డీఎంకే సహా పది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో రూ. 2,117.85 కోట్లు (83.64 శాతం) స్వచ్ఛంద విరాళాల నుంచి వచ్చాయి. ఇందులో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు రూ. 1,796.02 కోట్లు (70.93 శాతం).
మరోవైపు ఏడీఆర్ ఆర్టీఏ దరఖాస్తుకు ప్రతిస్పందనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలు రూ. 4,507.56 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను తిరిగి పొందాయి. ఇందులో దాదాపు 55.99 శాతం (రూ. 2,524.14 కోట్లు) జాతీయ పార్టీలు, 39.84 శాతం (రూ. 1,796.02 కోట్లు) ప్రాంతీయ పార్టీలు సేకరించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం మూడు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన