
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కానందుకు నిరసనగా ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రకటించింది. ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ నెల 15 నుంచి ఇంజనీరింగ్ సహా ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, బి.ఇడి తదితర 200 కళాశాలలు బంద్‌లో పాల్గొంటాయని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ వెల్లడించారు.
ఈ కాలేజీల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వృత్తి కాలేజీల బంద్‌పై శుక్రవారం ఫెడరేషన్ నాయకులు రమేష్, కృష్ణారావు, సునీల్‌కుమార్, రాందాస్ తదితరులు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కళాశాలలు ఈ బంద్‌లో భాగమవుతున్నట్లు ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఫెడరేషన్ నేతల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ నిధులు విడుదల కాకపోవడంతో అనేక కాలేజీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో బంద్ పాటించాలని నిర్ణయించామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఈనెల 30లోగా పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల బకాయిలు విడుదల చేస్తే, దసరా తర్వాత యధావిధిగా కాలేజీలు కొనసాగుతాయని, లేనిపక్షంలో నిరవధిక బంద్ కొనసాగిస్తామని హెచ్చరించారు.
రూ.1200 కోట్లకు ఇప్పటికే టోకన్లు విడుదలయ్యాయని, వెంటనే ఆ మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దసరా పండుగకు కూడా తమ సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దీనస్థితిలో ఉన్నామని, దాంతో సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు