
ఉన్నతవర్గం నివసిస్తున్నందున ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా? అని సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. బాణాసంచాపై నిషేధం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకూడదని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా కాలుష్య రహితమైన గాలిని పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం మౌఖికంగా వ్యాఖ్యానించింది. బాణసంచాపై ఏదైనా విధానం ఉంటే అది దేశవ్యాప్తంగా ఉండాలని, కేవలం ఢిల్లీ కోసం మాత్రమే ఉండకూడదని స్పష్టం చేశారు.
గతేడాది తాను అమృత్సర్లో ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీ కంటే ఎక్కువగా కాలుష్యం ఉందని, కాబట్టి బాణసంచాపై ఏదైనా నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తే అది దేశవ్యాప్తంగా ఉండాలని సీజేఐ పేర్కొన్నారు. వాయు కాలుష్యంపై నివేదికను సమర్పించాల్సిందిగా వాయు నాణ్యతా నిర్వహణ సంస్థ (సిఎక్యూఎం) ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
బాణాసంచాపై ఆంక్షలను దేశవ్యాప్తంగా అమలు చేసేలా ఒక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయి అభిప్రాయపడ్డారు.
అలాగే ఈ పరిశ్రమపై ఆధారపడిన పేద ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. శీతాకాలం, దీపావళి పండుగలు వస్తుండటంతో విచారణ చేపట్టింది. దేశంలోని ఇతర ప్రాంతాలు, నగరాల్లో నివసించే పౌరులకు జాతీయ రాజధాని నగరంలోని ఉన్నతవర్గానికి లభించినంత ఉపశమనం ఎందుకు ఇవ్వకూడదని జస్టిస్ బి.ఆర్.గవారు ప్రశ్నించారు.
ఇది జాతీయ రాజధాని నగరం లేదా సుప్రీంకోర్టు ఈ ప్రాంతంలో ఉన్నందున, భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కాకుండా కాలుష్య రహిత గాలి ఇక్కడ ఉండాలా? అని ప్రశ్నించారు. వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఉన్నత వర్గానికి సొంత మార్గాలు ఉన్నాయని వాయుకాలుష్య కేసుల్లో అభిప్రాయం వ్యక్తం చేసే సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే బాణసంచా కంపెనీల తరఫున పలువురు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బాణసంచాపై నిషేధం విధించడం కారణంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహాయంతో హరిత బాణసంచాను తయారు చేయడానికి బాణసంచా పరిశ్రమ సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు