పంజాబ్ కు రూ 1,600 కోట్లు, హిమాచల్ కు రూ. 1,500 కోట్లు వరద సహాయం

పంజాబ్ కు రూ 1,600 కోట్లు, హిమాచల్ కు రూ. 1,500 కోట్లు వరద సహాయం
వరదల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని, పరిస్థితిని సమీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్‌కు రూ.1,600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.1,500 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించారు. పంజాబ్‌కు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రూ.12,000 కోట్లకు అదనంగా ఈ సహాయం అందుతుంది. వరదలు, ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వారి బంధువులకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రధాని ప్రకటించారు. 
 
రెండు రాష్ట్రాలలో వరద పరిస్థితిని సమీక్షించడానికి పంజాబ్, పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లకు ఒక రోజు పర్యటనలో ఉన్న మోదీ, వైమానిక సర్వే నిర్వహించిన తర్వాత పంజాబ్ లో అత్యంత ప్రభావితమైన జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో అడుగుపెట్టారు. అంతకు ముందు, ఆయన హిమాచల్‌ను సందర్శించి రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన పరిస్థితిని సమీక్షించారు. 
 
గురుదాస్‌పూర్‌లో వరద బాధిత ప్రజలతో పాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్  బృందాలను ప్రధాని కలిశారు. గురుదాస్‌పూర్‌లో అధికారులు, ఎన్నికైన ప్రతినిధులతో జరిగిన అధికారిక సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు.  చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు అలాగే పంజాబ్‌లో సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు. 
 
గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, వ్యవసాయ మంత్రి గుర్మీత్ ఖుడియన్, కేంద్ర మంత్రి రవ్‌నీత్ బిట్టు, రెవెన్యూ మంత్రి హర్‌దీప్ ముండియన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తీవ్రంగా ప్రభావితమైన మండి, కులు జిల్లాలలో ప్రధాని వైమానిక సర్వే జరిపారు. పరిస్థితి తీవ్రతను ప్రధాని అంగీకరించారు . కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. 
 
ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చేరుకున్నప్పుడు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రతిపక్ష నాయకుడు జై రామ్ ఠాకూర్, రాష్ట్ర పార్టీ చీఫ్ రాజీవ్ బిందాల్ వంటి బిజెపి నాయకులు కూడా గగ్గల్ విమానాశ్రయంలో ఉన్నారు.