
* హోంమంత్రి రాజీనామా… పోలీస్ కాల్పులలో 19 మంది మృతి
యువకుల హింసాత్మక నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియా సైట్లను నిషేధించాలనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం నేపాల్ కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ‘జనరేషన్ జడ్ డిమాండ్’ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు.
రాజధాని ఖాట్మండు సహా పలు ప్రధాన నగరాల్లో సోమవారం నిరసనలు, ఆందోళనలు, హింస చెలరేగింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పలు రౌండ్లు జరిపిన కాల్పులు, హింసాకాండలో ఇప్పటివరకు 19మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని నేపాల్ వార్తా పత్రికలు వెల్లడించాయి. పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు.
దేశవ్యాప్తంగా పలుచోట్ల భద్రతా బలగాలతో వేలాదిమంది ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. నేపాల్ ప్రభుత్వ అవినీతి ఆరోపణలపైనా, ఇటీవల ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా రాజధాని ఖాట్మండులోని పార్లమెంటు వెలుపల జనరేషన్ – జెడ్ ఆందోళనకారులు నిరసనలకు దిగారు. ఖాట్మండుతో పాటూ పోఖ్రా, బుత్వాల్, భైరవా, భరత్పూర్, ఇటాహరి, దామక్ సహా పలు ప్రధాన నగరాల్లో వీధుల్లోకి వచ్చిన యువతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సోషల్ మీడియాపై నిషేధం విధించడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేయడమేనని విమర్శించారు. పౌరులపై నిఘా పెంచడమేనని మండిపడ్డారు. సాయంత్రం 3.30గంట నుండి కర్ఫ్యూ విధించినా దాన్నే మాత్రమూ లెక్క చేయకుండా ఆందోళనలు సాగాయి. నిరసనకారులు పార్లమెంటు గేటును ధ్వంసం చేసి, ఆవరణలోకి చొచ్చుకుపోవడంతో పోలీసులు పలుమార్లు కాల్పులు జరిపారు. జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. పలుచోట్ల భద్రతా బలగాలతో ఆందోళనకారులు ఘర్షణ కూడా పడ్డారు.
ఫలితంగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొంది. గాయపడిన వారందరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో జర్నలిస్టులు కూడా వున్నారు. పలు ఆస్పత్రుల్లో ఎమర్జన్సీ వార్డులు కూడా నిండిపోయాయి. ఆస్పత్రుల అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఖాట్మండులోని వివిధ ఆస్పత్రుల్లోనే 17మంది మృతి చెందారు. సున్సారిలో ఇద్దరు ఆందోళనకారులు కాల్పుల్లో చనిపోయారు. వివిధ ఆస్పత్రుల్లో 347మంది గాయపడినవారు చికిత్స పొందుతున్నారు.
దేశంలో తలెత్తిన హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఎదురైన ఒత్తిడికి తలొగ్గుతూ నేపాల్ హోం మంత్రి రమేష్ లేఖక్ సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. యువతపై అణచివేత చర్యలకు పాల్పడినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన రాజీనామా లేఖ అందచేశారు.
సెప్టెంబర్ 4వ తేదీన నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రభుత్వం మొత్తంగా దేశంలో సోషల్ మీడియాను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్‌చాట్ వంటి వేదికలతో సహా విస్తృతంగా ఉపయోగించే యాప్‌లను, రిజిస్టర్ చేసుకోని మరికొన్ని సామాజిక మాధ్యమాలను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై ప్రజాగ్రహం పెల్లుబికింది.
సోషల్ మీడియా మద్దతుదారులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నేటి తరం యువత నేపాల్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు, ఆందోళనలు చేపట్టారు. సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపు మేరకే యువత వీదుల్లోకి వచ్చింది. కానీ కాసేపటికే పరిస్థితి అదుపు తప్పింది. సోమవారం లాయించౌర్‌లోని అధ్యక్షుని నివాసం (శీతల్ నివాస్), మహారాజ్‌గంజ్‌లోని ఉపాధ్యక్షుని నివాసం, బలూవతార్‌లోని ప్రధాని నివాసం సింఘా దర్బార్లను అన్నివైపుల నుండి ఆందోళనకారులు చుట్టుముట్టారు. దీంతో ఖాట్మండు జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. మరికొన్ని జోన్లలో కూడా రాత్రి పది గంటల వరకు కర్ప్యూను విధించారు.
అయినా పరిస్థితుల్లో మార్పు లేదు. ఆందోళనకారులు శాంతించలేదు. ప్రధాని నివాసంపై రాళ్లు రువ్వారు. నిరసనలు ఉధృతమవుతుండడంతో సైన్యం రంగంలోకి దిగింది. పరిస్థితులను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. బారికేడ్లను భద్రతా బలగాలు ఏర్పాటు చేయగా, ఆందోళనకారులు వాటిని కూడా విరగ్గొట్టి మరీ పోలీసు వలయాన్ని ఛేదించుకుని పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించారు.
ప్రధాని కె.పి.శర్మ ఓలితో సహా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ప్రధాని దేశాన్ని వీడాలని వారు డిమాండ్ చేశారు. టిక్‌టాక్ వంటి కొన్ని సోషల్ మీడియాసైట్లు పనిచేస్తుండడంతో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. రక్తమోడుతూ యూనిఫారాల్లో వున్న విద్యార్ధులు, ఆందోళనకారులను సమీప ఆస్పతులకు తీసుకెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఆందోళనకారులపై పోలీసులు అతిగా వ్యవహరించారని నేపాల్ మానవ హక్కుల కమిషన్ విమర్శించింది. నూతన తరం వాణిని కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని, తక్షణమే ఆందోళనకారులపై బల ప్రయోగాన్ని ఆపాలని కోరింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అటు భద్రతా బలగాలు ఇటు ఆందోళనకారులు సంయమనం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
More Stories
అఫ్గానిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి
యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్
రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!