మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటికి భారీ జరిమానా

మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటికి భారీ జరిమానా

కేరళకు చెందిన ఓ నటికి ఆస్ట్రేలియాలో షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్‌ కోసం అక్కడికి వెళ్లిన ఆమె ఓ మూరెడు మల్లెపూల దండ వెంట తీసుకెళ్లినందుకే ఆమెకు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. మలయాళీలకు ఓనం పండగ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్‌ ఆఫ్‌ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది. 

కేరళకు చెందిన నటి నవ్య నాయర్‌ ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సమయంలో ఆమె బ్యాగ్‌లో మల్లెపూలు ఉన్నాయి.  ఆమె తనతో పాటు 15 సెంటీ మీటర్ల మల్లెపూల దండను వెంట తీసుకెళ్లారు. దీంతో మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు ఆమె వద్ద ఉన్న పూల దండను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆస్ట్రేలియాకు ఇతర దేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, పూలు, ఆహార పదార్థాలు వంటి వాటిని తీసుకురావడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయని చెబుతూ జరిమానా విధించారు.  ఈ విషయాన్ని నటి అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు.  ఆస్ట్రేలియా వచ్చే ముందు తన కోసం తన తండ్రి మల్లెపూలు కొని తెచ్చినట్లు తెలిపారు. అయితే, అందులో కొన్నింటిని తలలో పెట్టుకోగా, మరికొన్నింటిని తన హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకున్నట్లు వివరించారు.

తాను చేసింది చట్ట విరుద్ధమే అయినా, తెలియక చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పొరపాటున జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చారు.  అయితే, మల్లెపూల కారణంగా అధికారులు తనకు రూ.1.14 లక్షల జరిమానా  వేసినట్లు చెప్పారు. ఆ జరిమానాను 28 రోజుల్లోపు చెల్లించాలని వారు తనకు చెప్పినట్లు నటి వివరించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.