క్యాన్సర్‌ టీకాను అభివృద్ధి చేసిన రష్యా

క్యాన్సర్‌ టీకాను అభివృద్ధి చేసిన రష్యా
ప్రపంచంలోని లక్షలాది మంది క్యాన్సర్‌ రోగులకు రష్యా టీకాను తీసుకొస్తున్నది. కరోనా టీకాల్లో విజయవంతంగా ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ (మెసెంజర్‌ రిబోన్యూక్లియిక్‌ యాసిడ్‌) టెక్నాలజీ ఆధారంగా ఎంటెరోమిక్స్‌ అనే టీకాను అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీతో తయారైన మొదటి క్యాన్సర్‌ టీకా ఇదే. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ ఎంటెరోమిక్స్‌ టీకా నూటికి నూరు శాతం సత్ఫలితాలను చూపించింది. 
 
పెద్ద కణతులు గల రోగులు ఈ టీకాను తీసుకున్నపుడు, ఆ కణతుల పరిమాణం తగ్గడంతోపాటు, క్యాన్సర్‌ నాశనమైంది. ‘రష్యా టుడే’ కథనం ప్రకారం, ఈ టీకాకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అనుమతులు మంజూరైన వెంటనే దీనిని రోగులకు అందుబాటులోకి తీసుకొస్తారు.  అత్యంత కచ్చితత్వంతో క్యాన్సర్‌ కణాలను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ ఎంటెరోమిక్స్‌ టీకాను అభివృద్ధి చేశారు.
ఇది కండరాలలోకి ఇచ్చే ఇంజెక్షన్‌. రష్యాలోని చాలా ఆంకాలజీ సెంటర్లలో ఇప్పటికే దీనిని క్లినికల్‌గా ఉపయోగించారు. కీమోథెరపీ లేదా రేడియేషన్‌ విధానాల మాదిరిగా కాకుండా ఈ టీకాను ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ఇవ్వవలసి ఉంటుంది.  ఈ టీకాను రష్యాకు చెందిన నేషనల్‌ మెడికల్‌ రిసెర్చ్‌ రేడియలాజికల్‌ సెంటర్‌, ఎంగెల్‌హర్డ్‌ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాలెక్యులార్‌ బయాలజీ అభివృద్ధి చేశాయి. ఎంటెరోమిక్స్‌ టీకా రోగి శరీరంలోని ట్యూమర్‌ మార్కర్స్‌ను గుర్తించడంలో రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది.
ఆరోగ్యకరమైన కణాలు, చెడు కణాల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది.  అనంతరం చెడు కణాలపై దాడి చేసేలా చేస్తుంది. దీనిని రోగులకు ఇచ్చినపుడు, క్యాన్సర్‌ రకాన్ని బట్టి ట్యూమర్‌ 60-80 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకునే రేటు కూడా పెరిగినట్లు గమనించారు. ఎంటెరోమిక్స్‌ టీకా వల్ల రోగులు వారి ట్యూమర్ల ప్రత్యేక జెనెటిక్‌ ప్రొఫైల్‌కు తగినట్లుగా డిజైన్‌ చేసిన వ్యాక్సిన్లను తీసుకోవడానికి అవకాశం వస్తుంది. 

ఈ విధంగా వ్యక్తిగతంగా రోగ నిర్ధారణ చేసి, టీకాలను ఇవ్వడం వల్ల క్యాన్సర్‌ అనేది ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి తట్టుకోగల ఆరోగ్య పరిస్థితి స్థాయికి మారుతుంది. ఫలితంగా లక్షలాది మంది రోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఊపిరితిత్తులు, రొమ్ము, కొలెరెక్టల్‌, పాంక్రియాటిక్‌ క్యాన్సర్లతో బాధపడేవారు ఈ టీకాను వాడవచ్చు.  అదేవిధంగా హెరిడిటరీ క్యాన్సర్‌ సిండ్రోమ్స్‌తో హై రిస్క్‌ గల రోగులు, కీమోథెరపీ రెసిస్టెంట్‌ క్యాన్సర్లు గల వారు ఈ టీకా వల్ల ప్రయోజనం పొందవచ్చు. సంప్రదాయ చికిత్సలను తట్టుకోలేని వారు కూడా ఈ టీకా వైపు చూడవచ్చు.